విశాఖ స్టీల్ ప్లాంట్ నిర్వహణ లోపాలపై కొత్త కొత్త విషయాలు తెరపైకి వస్తున్నాయి. స్టీల్ ప్లాంట్ లో తాజా ఇన్సిడెంట్ తో భద్రత వైఫల్యాలు తెరపైకి వస్తున్నాయి. నిపుణులైన మానవ వనరులను తగ్గించుకుంటూ, నిర్వహణను గాలికొదిలేస్తే భారీ ప్రమాదాలు జరుగుతాయని కార్మిక సంఘాలు మొత్తుకున్నా యాజమాన్యం పట్టించుకోలేదంటున్నారు. ఇప్పటికైనా ఒక ఫర్నేస్‌ను నిలిపివేసి కోకోవన్, సింటర్ ప్లాంటు, పవర్ ప్లాంటుకు మేజర్ రిపేర్లు చేయాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. విశాఖ ఉక్కుకు నిపుణులైన మానవ వనరులే బలం. అలాంటిది గత రెండేళ్లలో ఉద్యోగులను తొలగించుకుంటూ వస్తున్నారు. గతంలో ప్లాంటులో ఒప్పంద కార్మికులు 15వేల మంది ఉండేవారు. ప్రస్తుతం 7500 మంది ఉన్నారు. ఇది కూడా ఓ సమస్యగా మారింది.
SMS-2లోనూ భారీ ప్రమాదం..
మరోవైపు సోమవారం జరిగిన ఘటనలో రెండు ప్రమాదాలు జరిగిన విషయం తాజాగా బయటకు వచ్చింది. నిజానికి స్టీల్ మెల్ట్ షాప్ 1లో ప్రమాదం జరిగి 8 మంది చనిపోయారు. కానీ SMS 2లోనూ ఇదే తరహా ఇన్సిడెంట్ జరిగినట్లు గుర్తించారు. సోమవారం సాయంత్రం 3 గంటల 57 నిమిషాలకు లాడిల్‌లో పేలుడు జరిగి 60 టన్నుల ఉక్కు ద్రవం ఒలికిపోయిందని ఐడెంటిఫై చేశారు. ఈ టైంలో పర్మినెంట్ ఉద్యోగులు నలుగురు, ఇన్‌ఛార్జులు ఇద్దరు, పది మంది కళాసీలు మొత్తం 16 మంది ఈ ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
విశాఖ స్టీల్ ప్లాంట్‌పై కార్మికుల ఆరోపణలు
విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం భద్రతా నిబంధనలను నిర్లక్ష్యం చేయడంతో ప్రాణాంతక ప్రమాదాలు జరుగుతున్నాయంటున్నారు కార్మికులు. రక్షణ చర్యలు తీసుకోవాలని డిసెంబర్ 9న లేబర్ కమిషనర్‌కు కార్మిక సంఘాలు లేఖ రాశాయి. 2024 జనవరి నుంచి 20 మంది మరణించారని, 200 మందికిపైగా గాయపడ్డారని, అయితే ప్రమాదాలపై ఎంక్వైరీ రిపోర్టులను కూడా రిలీజ్ చేయలేదని ఆ లెటర్ లో ప్రస్తావించారు. గతేడాది జరిగిన ప్రమాదాల వివరాలతో ఈ ఏడాది మార్చిలో డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్‌కు సైతం కంప్లైంట్ చేశారు. టైం ఇవ్వకుండా ఒత్తిడి పెట్టడంతో ప్రొటోకాల్స్ అమలు కావట్లేదన్న ఆరోపణలున్నాయి. ద్రవపు ఉక్కులో గ్యాస్ పూర్తిగా తొలగించకుండానే ముందుకు పంపారని, అందువల్లే లాడిల్‌లో పేలుడు జరిగిందంటున్నారు.
రూ.11,400 కోట్లు వచ్చాయి.. కానీ భద్రత ఎక్కడ?
ప్లాంట్‌లోని యంత్రాలు, ల్యాడిల్‌లు ఏళ్ల తరబడి సరైన రిపేర్లకు నోచుకోలేదని, రక్షణ కవచాలు లేవని కార్మికులు గతంలోనే యాజమాన్యానికి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదంటున్నారు. కేంద్ర ప్రభుత్వం గతంలో 11,400 కోట్ల రూపాయల ఆర్థిక సాయం అందించినప్పటికీ, యంత్రాల నిర్వహణకు, స్పేర్ పార్ట్స్ కొనుగోలుకు నిధులు సరిగ్గా కేటాయించలేదని కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. గత మూడేళ్లలో ప్లాంట్‌లో పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ ను తొలగించారని, మిగిలిన కార్మికులపై పనిభారం పెరిగిందని, అనుభవజ్ఞులైన సిబ్బంది లేకపోవడం కూడా భద్రతా వైఫల్యాలకు కారణమైందని కార్మిక నేతలు అంటున్నారు. ఈ ప్రమాదంపై సమగ్ర దర్యాప్తు కోసం కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి ముగ్గురు సభ్యుల స్వతంత్ర నిపుణుల కమిటీని నియమించారు. ఈ కమిటీ 15 రోజుల్లో పూర్తి నివేదిక సమర్పించనుంది. ఆ రిపోర్టునైనా బయటపెడుతారా లేదా అన్న డౌట్లు పెరుగుతున్నాయి.
కార్మికులపై తీవ్ర ఒత్తిడి!
కార్మికులు ఎంత చెప్పినా యంత్రాలను అప్ గ్రేట్ చేయలేదని కార్మిక సంఘం నేతలు మండి పడుతున్నారు. మెల్టింగ్ టైంలో వాడే రా మెటీరియల్ కూడా నాసిరకమే అని అంటున్నారు. నిపుణులైన కార్మికులను తీసేయడం కూడా సమస్యే అంటున్నారు. స్టీల్ ప్లాంట్ లో కొత్త రిక్రూట్‌మెంట్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఉన్న ఉద్యోగులపైనే ఒత్తిడి పెట్టి రోజుకు హాట్‌మెటల్ ఉత్పత్తి లక్ష్యం 19వేల టన్నులుగా నిర్దేశించారు. ప్రస్తుతం 17వేల టన్నుల వరకు ఉత్పత్తి చేస్తున్నారు.








