– సీఎం రేవంత్‌రెడ్డి కూడా బాధితుడే
– గత ప్రభుత్వ పెద్దలను ఎవరినీ వదలొద్దు
– అందెశ్రీ పాటను స్వాగతిస్తాం
(అమ్మన్యూస్, హైదరాబాద్):
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ లక్ష్మణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్ నేతలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు ప్రశ్నించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితుడేనని అన్నారు. కాంగ్రెస్ హైకమండ్ ఆదేశాలతో రేవంత్ రెడ్డి మౌనంగా ఉన్నారా? అని అనుమానం వ్యక్తం చేశారు. ఫోన్ ట్యాపింగ్‌పై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగేలా వ్యవహరించిన గత ప్రభుత్వ పెద్దలను ఎవరినీ వదలొద్దని, వారిపై సీఎం రేవంత్ రెడ్డి చర్యలు తీసుకోవాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కేసీఆర్ తన కూతురు కవితను లిక్కర్ స్కామ్ కేసు నుంచి తప్పించేందుకే ఫోన్ ట్యాపింగ్ చేయించారని ఆరోపించారు. ఢిల్లీ పెద్దలను ఇరికించి తన కూతురుని లిక్కర్ స్కామ్ కేసు నుంచి బయట పడేయాలని కేసీఆర్ చూశారన్నారు. వ్యక్తిగత స్వేచ్ఛను హరించే హక్కు గత కేసీఆర్ ప్రభుత్వానికి ఎవరు ఇచ్చారని లక్ష్మణ్ ప్రశ్నించారు.
అందెశ్రీ పాటతో ప్రేరణ..
అందెశ్రీ రాసిన జయజయహే తెలంగాణ పాటను తాము స్వాగతిస్తామని ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఆ పాట రాష్ట్ర ప్రజలందరికీ ప్రేరణ కలిగిందని పేర్కొన్నారు. అలాగే రాష్ట్ర అధికారిక చిహ్నంపై వస్తున్న వార్తలపై ప్రస్తుతం తాము స్పందించబోమని, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చాక స్పందిస్తామన్నారు.









