AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణలో పది సీట్లు పక్కా.. అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు

ఏపీలో కొత్త ప్రభుత్వమే..
కేంద్రంలో వచ్చేది మళ్లీ మేమే

(అమ్మన్యూస్, న్యూఢిల్లీ):
కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పది స్థానాల్లో మేమే గెలవబోతున్నామని అన్నారు. ఏపీలోనూ కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతున్నదన్నారు. కేంద్రంలోనూ తామే మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నామని స్పష్టం చేశారు. తాజాగా జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ మరోసారి గెలవడం ఖాయమని అమిత్‌ షా తేల్చిచెప్పేశారు. ఒడిశా, ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణపై మీ అంచనాలు ఏమిటని అడిగిన ప్రశ్నకు అమిత్‌ షా సమాధానం ఇచ్చారు. ఒడిశాలో 17 లోక్‌ సభ సీట్లు, 75 అసెంబ్లీ సీట్లు టార్గెట్‌ పెట్టుకున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణలో 10 సీట్లు గెలుస్తామన్నారు.

అలాగే ఏపీలో తమ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని, అలాగే భారీ మొత్తంలో లోక్‌ సభ సీట్లను కూడా గెల్చుకోబోతున్నట్లు అమిత్‌ షా తెలిపారు. ఉత్తర, పశ్చిమ భారతంలో ప్రబల శక్తిగా ఉన్న బీజేపీ.. ఈసారి తూర్పు, దక్షిణ భారతంలోనూ సత్తా చాటుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో టీడీపీ–జనసేనతో జట్టు కట్టింది. ఈ నేపథ్యంలో ఏపీలో విజయంతో పాటు గణనీయంగా లోక్‌ సభ సీట్లు సాధించడంపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఇప్పటికే ఏపీలో కూటమి గెలుస్తోందని మోడీతో పాటు అమిత్‌ షా కూడా పలుమార్లు పేర్కొన్నారు. వీరి వ్యాఖ్యలో నిజమెంతో జూన్‌ 4న తేలిపోనుంది.

ANN TOP 10