రాజ్యాంగం అనుసరించే తెలంగాణ సాధించుకున్న చరిత్ర మనది
జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్
(అమ్మన్యూస్ పెద్దపల్లి):
బడుగు బలహీనవర్గాల రాజ్యాధికారం కోసం అంబేడ్కర్ స్ఫూర్తితో ముందుకు సాగుదామని పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ అన్నారు. దేశంలో, రాష్ట్రంలో అనేక ఏళ్లు పరిపాలన చేసిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు రాజ్యాంగం అంటే సమాజానికి తెలియకుండా చేశారని మండిపడ్డారు. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 133వ జయంతి సందర్భంగా మంథనిలోని అంబేడ్కర్ విగ్రహానికి ఆయన పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ అంటే ఒక్క వర్గానికి చెందిన వారని చిత్రీకరించి విడదీసి పరిపాలన చేశారని అన్నారు. అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అనుసరించే తెలంగాణ సాధించుకున్న చరిత్ర మనదని గుర్తు చేశారు. సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పదేళ్ల పాటు బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మహనీయుల జయంతి, వర్ధంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించుకున్నామన్నారు. ఆనాడు మంథని ప్రాంతంలో అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణ ఆంక్షల నడుమ జరిగిందని, అప్పటి ఎంపీ సుగుణకుమారి అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే ప్రారంభోత్సవానికి ఆమెను అడ్డుకున్నారని అన్నారు. 144సెక్షన్ మధ్య ఆవిష్కరించుకోవడం జరిగిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మహనీయుల విగ్రహాలు కనుబడుతాయా లేదోనన్న సందేహాలు వ్యక్తం వ్యక్తమవుతున్నాయన్నారు.









