తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీయేనని మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు అన్నారు. మెదక్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా సంగారెడ్డి నియోజకవర్గం పార్లమెంట్ కార్యకర్తల సమావేశం అసెంబ్లీ ఇన్చార్జి జగ్గారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు.అటవీ పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి, పార్లమెంట్ ఇంచార్జ్ కొండా సురేఖ హాజరయ్యారు. ఈ సందర్భంగా సమావేశంలో నీలం మధు మాట్లాడుతూ.. ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నీ ఇంటింటికి తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందని అన్నారు. రాహుల్ గాంధీ దేశ ప్రధానిగా అవకాశం ఇవ్వాలని, ఇందుకు కార్యకర్తలందరు కలిసికట్టుగా పనిచేయాలని సూచించారు. ఇందిరాగాంధీ ప్రాతినిధ్యం వహించిన మెదక్ ప్రాంతానికి ఫ్యాక్టరీలు, కంపెనీలు తీసుకొచ్చి యువతకు ఉపాధిని కల్పించిందని గుర్తు చేశారు. మెదక్ పార్లమెంటు పోటీ చేసేందుకు అవకాశం ఇచ్చిన అధిష్టానం, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, మంత్రి కొండా సురేఖ, సంగారెడ్డి ఇంచార్జ్ జగ్గారెడ్డికి ఈ సందర్భంగా నీలం మధు థ్యాంక్స్ చెప్పారు.
నీలం మధును గెలిపించి.. పార్లమెంట్‌లోకి పంపిద్దాం: మంత్రి సురేఖ
మరోవైపు బీఆర్ఎస్ హయాంలో అనేక నిర్బంధాలకు గురయ్యామని మంత్రి కొండా సురేఖ అన్నారు. రాజకీయ ప్రస్థానంలో ఎన్నో అక్రమ కేసుల నమోదు, జైలుకెళ్లామని తెలిపారు. జనాల్లో ఉన్నాం.. అందుకే ప్రజలు ఆదరించి మళ్లీ పట్టం కట్టారని అన్నారు. ఎంపీపీ స్థాయి నుంచి మినిస్టర్ వరకు ఎదిగానని గుర్తు చేశారు. రైతు బంధు పథకంపై బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అప్పుడు కొంత ఇప్పుడు కొంత బిచ్చం వేసినట్లుగా రైతుబంధు వేసిన విషయాషని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన మూడు నెలల్లోనే 99 శాతం మేర రైతులకు ఒకేసారి రైతుబంధును వేసామని స్పష్టం చేశారు. గజ్వేల్, సిద్దిపేట నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీ మెజారిటీ సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పేదల సంక్షేమం, అభివృద్ధి కి పాటు పడే ఏకైక పార్టీ కాంగ్రెస్ అని పేర్కొన్నారు. మెదక్ గడ్డ నుంచి పోటీ చేసిన ఇందిరమ్మ అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు దోహద పడిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ఎన్నికలలో ఎంపీ స్థానం కాంగ్రెస్ కైవసం చేసుకుంటే రాహుల్ గాంధీ నానమ్మ సీటు గెలిచిందని, సోనియా గాంధీ అత్తమ్మ సీటు గెలిచిందని సంతోషపడుతారని పేర్కొన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన కాబోయే ఎంపీ నీలం మధు ముదిరాజును గెలిపించుకుని, పార్లమెంట్ పంపించాలని మంత్రి కొండా సురేఖ కోరారు.









