ఆదిలాబాద్, అమ్మన్యూస్ ప్రతినిధి: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో సామాన్యుడు సీఎంను కలవాలంటే సాధ్యమయ్యేది కాదు. ఎమ్మెల్యేలకూ ఆయన దర్శన భాగ్యం లభించకపోయేది. మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలవాలంటే నెలల తరబడి వేచి చూడాల్సి వచ్చేది. అయితే గత డిసెంబర్‌లో బీఆర్ఎస్ సర్కారు పోయి.. కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం వచ్చింది. అప్పటి నుంచి ప్రజావాణి పేరుతో సామాన్యుల బాధలు వింటున్నది. జిల్లాల్లోనూ ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తున్నది. హైదరాబాద్ లోనూ సీఎం, మంత్రులు, ఉన్నతాధికారులు విడతల వారీగా ప్రజల కంప్లయింట్ ను తీసుకొని పరిష్కార మార్గాలను సూచిస్తున్నారు. అయితే నేరుగా తమ సమస్యను సీఎం కు చెప్పుకోవాలంటే అందరికీ సాధమయ్యే పని కాదు. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన వారు 320 కిలోమీటర్ల దూరంలో ఉన్న హైదరాబాద్‌కు వెళ్లి సీఎంను కలిసి తమ గోడును విన్నవించుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అయితే కేవలం పోస్టల్ ద్వారా తమ సమస్యను సీఎంఓకు పంపించినా.. అధికారులు అంతే ఫాస్ట్ గా రెస్పాండ్ అవుతున్నారు. సమస్య తీవ్రతను గుర్తించి ఫిర్యాదులను సంబంధిత అధికారులకు పంపించి పరిష్కరించాలని సూచిస్తున్నారు. కాగా, సీఎంఓకు పోస్ట్ ద్వారా కంప్లయింట్ చేయగా.. అత్యంత వేగంగా స్పందించి.. బాధితుడి సెల్ నెంబర్‌కు రెఫరెన్స్ నంబర్ పంపించి, ఫిర్యాదును బదిలీ చేయడం గత పదేళ్లలో ఎప్పుడూ చూడలేదని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు అభిప్రాయపడుతున్నారు.
సివిల్ మ్యాటర్స్ లో పోలీసుల జోక్యంపై స్పందన..
ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి, అతని ఇంటి పక్కనే ఉంటున్న ఓ పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన వ్యక్తికి మధ్య స్థల వివాదమున్నది. ఈ అంశాన్ని స్థానిక మున్సిపాలిటీ, కోర్టుల్లో పరిష్కరించుకునే వీలుంటుంది. అయితే మున్సిపాలిటీ అధికారుల నిర్ణయాలను ప్రభావితం చేసేలా పోలీస్ డిపార్ట్ మెంట్‌కు చెందిన వ్యక్తికి ఆ శాఖ ఉన్నతాధికారులు సపోర్ట్ చేస్తున్నారని బాధితుడు ఆరోపిస్తున్నాడు. స్థల వివాదం పై విచారణ చేపట్టడానికి మున్సిపల్ కమిషనర్, టౌన్ ప్లానింగ్ అధికారులు వచ్చినప్పుడు.. ఎవరూ పిలవకుండానే సీఐ, డీఎస్పీ స్థాయి అధికారులు స్పాట్ కు వచ్చి పురపాలక శాఖ అధికారులపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారని పేర్కొంటున్నాడు. అంతేకాకుండా పోలీస్ డిపార్ట్ మెంట్ పేరుతో తనను బెదిరింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నాడు. స్థానికంగా సమస్య పరిష్కారమయ్యే సూచనలు కనిపించకపోవడంతో బాధితుడు నేరుగా తన ఫిర్యాదును ఈ నెల ఒకటో తేదీన సీఎంఓ కార్యాలయానికి పంపించాడు. అయితే కొన్ని రోజుల వ్యవధిలోనే తన ఫిర్యాదును స్వీకరించినట్లు సీఎంఓ కార్యాలయం నుంచి బాధితుడి ఫోన్ కు మెస్సేజ్ వచ్చింది. అంతేకాకుండా ఫిర్యాదును ఆదిలాబాద్ ఎస్పీకి బదిలీ చేసినట్లు అందులో వెల్లడించింది. దీనిపై పూర్తిస్థాయిలో విచారణచేపట్టి, నివేదిక అందజేయాలని ఎస్పీని ఆదేశించినట్లు తెలిసింది.









