వరంగల్ బీఆర్‌ఎస్ అభ్యర్థిని ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ పార్లమెంట్ ఎంపీగా బీఆర్‌ఎస్ నుంచి సుధీర్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు ఆయన పేరును గులాబీ దళపతి కేసీఆర్ అధికారికంగా ప్రకటించారు. ప్రస్తుతం హన్మకొండ జెడ్పీ చైర్మన్‌గా ఉన్న సుధీర్ కుమార్‌ను తాజాగా ఎంపీగా పోటీ చేసేందుకు అవకాశం కల్పించింది. దీంతో బీఆర్‌ఎస్ రాష్ట్రంలో ఉన్న అన్ని పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మొదట వరంగల్ ఎంపీగా బీఆర్‌ఎస్ నుంచి కడియం కావ్యకు టికెట్ ఇచ్చింది. టికెట్ ఇచ్చిన కొద్ది రోజులకే పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి.. పార్టీకి రాజీనామా కూడా చేశారు. ఆమె కాంగ్రెస్ పార్టీలో చేరగా.. కాంగ్రెస్ నుంచి అదే స్థానంలో పోటీకి అవకాశం దక్కింది. కాంగ్రెస్ నుంచి బరిలోకి దిగడంతో కొత్త అభ్యర్థి కోసం బీఆర్‌ఎస్ అధిష్ఠానం అన్వేషిస్తోంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లు తెరపైకి వచ్చాయి.
అయితే వీరిలో తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కే అవకాశం ఉందని జోరుగా చర్చ నడిచింది. ఈ నేపథ్యంలో తాటికొండ రాజయ్యకు కేసీఆర్ నుంచి పిలుపు వచ్చింది. దీంతో హుటాహుటిన రాజయ్య ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌజ్‌కు బయలుదేరారు. అదే విధంగా ఉమ్మడి వరంగల్ బీఆర్‌ఎస్ నేతలతో కేసీఆర్ భేటీ అవ్వగా రాజయ్య కూడా పాల్గొన్నారు. కేసీఆర్ నుంచి స్పష్టమైన హామీ లభిస్తే మళ్లీ బీఆర్ఎస్‌లో చేరి వరంగల్ అభ్యర్థిగా బరిలోకి దిగాలని రెడీ అయ్యారు. ఈ తరుణంలో కేసీఆర్ అనూహ్యంగా నిర్ణయం తీసుకున్నారు. వరంగల్ అభ్యర్థిగా సుధీర్ కుమార్‌కు అవకాశం ఇవ్వడంతో ఎంపీగా పోటీ చేస్తానని భావించిన మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యకు నిరాశ మిగిలింది.









