ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ఆయన ఈ నెల 25న పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఏప్రిల్ 24న శ్రీకాకుళంలో బస్సు యాత్ర ముగించుకుని నేరుగా పులివెందుల వెళ్లనున్నారు. నామినేషన్ దాఖలు అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా ఈ నెల 22న సీఎం జగన్ తరఫున ఎంపీ అవినాశ్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ పత్రాలు దాఖలు చేయనున్నారు. నామినేషన్ తర్వాత జగన్ ఆయన సతీమణి వైఎస్ భారతి ఎన్నికలు ముగిసే వరకు పులివెందుల లో ఉంటారని తెలిసింది. ఇక ప్రస్తుతం సీఎం జగన్ మేమంతా సిద్ధం పేరుతో రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రల్లో బిజీగా ఉన్నారు.
కడపలో యాత్రను ఆరంభించిన అనంతరం నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్య సాయి పుట్టపర్తి, అన్నమయ్య రాయచోటి, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం మీదుగా పల్నాడు జిల్లాలో అడుగు పెట్టారు. మొత్తంగా మేమంతా సిద్ధం బస్సు యాత్ర 13వ రోజుకు చేరుకుంది. మరో వారం రోజుల్లో బస్సు యాత్ర ముగుస్తుందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 18న శ్రీకాకుళం జిల్లాలోని ఇచ్చాపురానికి చేరుకుని అక్కడ బస్సు యాత్ర ముగిస్తారు. నామినేషన్ తర్వాత మరోసారి రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలను జగన్ చుట్టేస్తారని పార్టీ వర్గాల నుంచి సమాచారం.









