డబుల్ బెడ్రూం ఇళ్లు ఎందుకు ఇవ్వలేదు?
ఫామ్ హౌస్‌ను ముట్టడించిన లబ్ధిదారులు
మోసం చేశారంటూ ఆగ్రహం
మేం ఏం పాపం చేశామంటూ మండిపాటు
(అమ్మన్యూస్, హైదరాబాద్):
డబుల్ బెడ్రూంలు ఇవ్వకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తమను మోసం చేశారంటూ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం ఉదయం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ దగ్గర డబుల్ బెడ్ రూమ్ లబ్ధిదారులు నిరసనకు దిగారు. డబుల్ బెడ్రూంలకు తమను ఎంపిక చేసినా ఇప్పటి వరకు ఇవ్వకపోవడంతో కేసీఆర్ ఫామ్ హౌస్ గేటు ఆందోళన చేశారు. మేము ఏం పాపం చేసినం.. గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్‌ను మూడు సార్లు గెలిపించామని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఎంగా గెలిచినప్పటి నుంచి మాకు ఏం చేశారని కేసీఆర్‌ను నిలదీశారు. అందరికీ డబుల్ బెడ్రూం ఇళ్లు ఇచ్చారని, కానీ మమ్మల్ని మాత్రం రోడ్డు మీద నిలబెట్టారని కేసీఆర్ పై మండిపడ్డారు. ‘మేము పిచ్చోళ్ల లెక్క కనిపిస్తున్నామా? కలెక్టరేట్ కు పోయాం.. సిద్దిపేట వచ్చినం.. ఇళ్లు ఇచ్చుడు చేతకానప్పుడు.. డ్రా ఎందుకు తీసినవ్? అని కేసీఆర్‌ను నిలదీశారు. దీంతో ఫామ్ హౌస్ దగ్గర ఉన్న పోలీసులు నిరసన కారులను అడ్డుకున్నారు. కేసీఆర్‌ను కలిసే వరకు ఇక్కడి నుంచి వెళ్లమంటూ లబ్ధిదారులు తేల్చి చెప్పారు.









