బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉందని, ఢిల్లీలో నరేంద్రమోదీకి కేసీఆర్ సహకరిస్తారు… తెలంగాణలో కేసీఆర్‌కు మోదీ సహకరిస్తారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శించారు. బీఆర్ఎస్ పాలనలో 8 వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఆందోల్‌లో కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరి సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ.. తెలంగాణ ఆదాయమంతటినీ కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని ఆరోపించారు.
‘‘ల్యాండ్, సాండ్, మైన్స్, వైన్స్ అంతా కేసీఆర్ కుటుంబం చేతిలోనే ఉంది. ధరణి పోర్టల్‌ను గుప్పిట్లో పెట్టుకుని పేదల భూములను గుంజుకున్నారు. పరీక్ష పేపర్ల లీక్ వల్ల ఎంతో మంది యువత నష్టపోయారు. కాళేశ్వరం ప్రాజెక్టులో రూ.లక్ష కోట్ల అవినీతి జరిగింది. ఈ పదేళ్లలో బీఆర్ఎస్ ఏం చేసిందో కేసీఆర్ చెప్తారా? దొరల సర్కార్‌కు, ప్రజల సర్కార్‌కు మధ్య తేడా ఏంటో మేం చెప్తున్నాం, చూపిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసి ప్రజల పాలనను చూపిస్తాం. తొలి కేబినెట్ సమావేశంలో ఆరు గ్యారంటీలపై సంతకం పెడతాం. ప్రధాని మోడీ నాపై 24కేసులు పెట్టారు. నా ఎంపీ సభ్యత్వం రద్దు చేసి ఎంపీల క్వార్టర్స్ నుంచి పంపించి వేశారు. అవినీతిపరుడైన కేసీఆర్‌పై మాత్రం ఒక్క కేసు కూడా లేదు. బీఆర్ఎస్, బీజేపీ మధ్య మంచి స్నేహం ఉంది. ఢిల్లీలో మోడీకి కేసీఆర్ సహకరిస్తారు, తెలంగాణలో కేసీఆర్‌కు మోడీ సాయం చేస్తారు. రాష్ట్రంలో కేసీఆర్ తన కుటుంబానికి మాత్రమే మేలు చేసుకుంటారు’’ అని రాహుల్‌గాంధీ విమర్శించారు.
ప్రాజెక్టుల పేరుతో వేల కోట్లు దోచుకున్నారన్నారు. ఈ పదేళ్ల కాలంలో బీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. తాము అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్నారు. ఆరు గ్యారెంటీలపై తొలి కేబినెట్ సమావేశంలోనే సంతకం చేస్తామన్నారు.









