తొమ్మిదిన్నరేళ్లలో సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలకు ఒరిగింది ఏమీ లేదని పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం నేలకొండపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని మాట్లాడుతూ… ‘‘రాబోయే కురుక్షేత్రంలో ధర్మానికి, అధర్మానికి జరుగుతున్న యుద్ధంలో మీరందరూ ఇందిరమ్మ రాజ్యం కోసం తెలంగాణ ప్రజల బాగుకోసం హస్తం గుర్తుపై ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి. అరవై ఏళ్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం. ఇచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీని కాదని మాయమాటలు నమ్మి అబద్ధాలు నమ్మి రెండు పర్యాయాలు కేసీఆర్‌కు పట్టం కట్టాం. కేసీఆర్ తెలంగాణకు చేసింది ఏమీ లేదు ఆయన స్వప్రయోజనాల కోసమే తప్ప తెలంగాణ ప్రజలను పట్టించుకోలేదు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణ ప్రజల సొమ్ము ఎలా దొంగిలించాలని చంద్రశేఖర్‌రావు ఆలోచించారు. BRS ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు కడితే ఒకటి కుంగి పోయింది, మరోకటి నెర్రెలు ఇచ్చింది. బీజేపీ, BRS కలిసి ఈనాడు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రాకుండా చేయాలని చూస్తున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు డ్యామ్‌లు కట్టిన దాంట్లో తప్పు జరిగిందని రిపోర్ట్ ఇస్తే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం మీద ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు’’ అని పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రశ్నించారు.
