AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

చెట్టుకు కట్టేసి.. పీక కోసి.. జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్య

హైదరాబాద్‌లో ఓ జూనియర్ ఆర్టిస్ట్ దారుణ హత్యకు గురయ్యాడు. తాను ప్రేమించిన అమ్మాయితో సన్నిహితంగా ఉంటున్నాడనే కోపంతో ఓ యువకుడు తన స్నేహితులతో కలిసి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్‌ జిల్లా సంకిస గ్రామానికి చెందిన కె.కార్తీక్‌ (18) హైదరాబాద్‌లో జూనియర్‌ ఆర్టిస్ట్‌గా జీవనం సాగిస్తున్నాడు. ఆగస్టు 13 నుంచి అతడు కనిపించకుండా పోయాడు. దీంతో 16న సోదరుడు శంకర్‌ జూబ్లీహిల్స్‌ పోలీసులకు మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్‌ సిగ్నళ్ల ఆధారంగా నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ప్రేమ వ్యవహారమే హత్యకు కారణంగా గుర్తించారు.

విజయనగరం జిల్లా రాగోలుకు చెందిన సాయి హైదరాబాద్‌లో ఉంటూ యూట్యూబర్‌గా చేసేవాడు. అతనికి జూనియర్‌ ఆర్టిస్ట్‌ అయిన ఓ యువతి(19)తో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లకు సాయి ప్రవర్తన నచ్చక అతడిని యువతి దూరం పెట్టింది. ఈ క్రమంలోనే జూనియర్ ఆర్టిస్టుగానే చేస్తున్న కార్తీక్‌ యువతికి దగ్గరయ్యాడు. గత నెలలో ఇద్దరూ కలసి యూసుఫ్‌ గూడలోని కార్తీక్‌ సోదరుడు శంకర్‌ గదికి వెళ్లి మూడు రోజులు అక్కడే ఉన్నారు. ఈ విషయం తెలిసి సాయి కార్తీక్‌తో గొడవపడ్డాడు. అనంతరం అతడిని చంపేయాలని నిర్ణయం తీసుకున్నాడు. మిత్రులైన కె.సురేష్‌ , ఎం.రఘు, ఎన్‌.జగదీశ్‌ సాయం కోరాడు.

ప్లాన్ ప్రకారం ఆగస్టు 13న కార్తీక్‌ గదికి వెళ్లారు. ఆ యువతి దుస్తులు కొన్ని గదిలో ఉన్నాయని, వాటిని తీసుకెళ్లాలని నమ్మించారు. అనంతరం కార్తీక్‌ను బైక్‌పై బలవంతంగా ఎక్కించుకొని ఓల్డ్‌బోయినపల్లి అటవీ ప్రాంతం వైపు తీసుకెళ్లారు. అనంతరం కార్తీక్‌ను చెట్టుకు కట్టేసి తమ వెంట తెచ్చుకున్న కత్తితో పక్కటెముకల్లో పొడిచారు. కత్తి వంగిపోవటంతో బోర్లా పడేసి పీక కోశారు. పక్కనే ఉన్న బండరాయితో తలపై కొట్టి కిరాతకంగా హత్య చేశారు. అనంతరం అక్కడి నుంచి నిందితులు పరారయ్యారు.

కొద్దిరోజుల తర్వాత సురేష్‌ తన వద్ద ఉన్న కార్తీక్‌ సెల్‌ఫోన్‌ ఆన్‌ చేయడంతో పోలీసులు అలెర్ట్ అయ్యారు. సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా వెంటనే అతని ఆచూకీ తెలుసుకున్నారు. సురేష్‌ను అదుపులోకి తీసుకోగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు నిందితులు సాయి, రఘు, జగదీశ్‌లను అరెస్టు చేశారు.

ANN TOP 10