టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏసీబీ కోర్టులో తీవ్ర నిరాశ ఎదురైంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో చంద్రబాబుకు ఏసీబీ కోర్టు ఈ నెల 22 వరకు రిమాండ్ విధించింది. చంద్రబాబునాయుడుకి విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించడంతో ఆయనను ఆదివారం రాత్రి రాజమండ్రి సెంట్రల్ జైలుకు ప్రత్యేక కాన్వాయ్‌లో తరలించారు. విజయవాడ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైలు వరకు ఉన్న జాతీయ, రాష్ట్రీయ రహదారి వెంబడి పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఏలూరు సమీపం లోని కలపర్రు టోల్‌గేటు వద్దకు జిల్లా ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదివారం రాత్రి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. జాతీయ రహదారికి గ్రామాల నుంచి కలిపే సర్వీసు రోడ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసి కాన్వాయ్ దాటే వరకు వాహనాలను నిలిపివేశారు. కలపర్రు టోల్‌గేటు వద్ద కాన్వాయ్ రాత్రి 10.50 నిముషాలకు దాటింది. ఆశ్రం జంక్షన్ వద్ద భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి ఆందోళనలు చేయకుండానే ముందుగానే పోలీసులు ఆ ప్రాంతానికి వచ్చిన వారిని పంపించి వేశారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలను రహ దారిపైకి రాకుండా ముందస్తుగా నిర్బంధించారు.భీమడోలు మండలం సూరప్ప గూడెం వద్ద కార్యకర్తలు టీడీపీ జెండాలు తీసుకుని రహదారిపైకి రావడంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని వారిని చెదరగొట్టారు.
చంద్రబాబును నిన్న నంద్యాలలో సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనను తొలుత కుంచనపల్లి సిట్ కార్యాలయానికి తరలించి, సుదీర్ఘ సమయం పాటు విచారించారు. వేకువ జామున వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మళ్లీ సిట్ కార్యాలయానికి తీసుకెళ్లి, అక్కడ్నించి ఏసీబీ కోర్టుకు తరలించారు. చంద్రబాబు తరఫున సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వాదనలు వినిపించగా, సీఐడీ తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. మధ్యాహ్నానికి వాదనలు పూర్తికాగా, న్యాయమూర్తి తీర్పును రిజర్వ్ లో ఉంచారు. ఈ మధ్యాహ్నం నుంచి తీర్పు కోసం ఎదురుచూస్తున్న చంద్రబాబు… తీర్పు వెల్లడిస్తున్న నేపథ్యంలో కోర్టు హాల్లోకి వెళ్లారు. కోర్టు హాల్లోకి 30 మందిని మాత్రమే అనుమతించారు. తీర్పు నేపథ్యంలో కోర్టులో ఉద్విగ్నభరిత వాతావరణం నెలకొంది. తీర్పు నేపథ్యంలో ఏసీబీ కోర్టు వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.









