మల్కాజిగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్‌ఎస్ టికెట్.. మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్‌రెడ్డికి దక్కనుందా? ఈ విషయమై అధిష్ఠానం నిర్ణయానికి వచ్చిందా? అంటే అవుననే అంటున్నాయి ఆ పార్టీ వర్గాలు. మంత్రి మల్లారెడ్డి తన అల్లుడు రాజశేఖర్‌రెడ్డిని వెంటబెట్టుకొని సీఎం కేసీఆర్‌ను కలిశారు. శనివారం మల్లారెడ్డి పుట్టినరోజు కావడంతో.. కార్యకర్తలతో బిజీగా ఉన్న మంత్రి అకస్మాత్తుగా కార్యక్రమం మద్యలోనే వెళ్లిపోయారు. ఆగమేఘాల మీద కేసీఆర్ వద్దకు వెళ్లడంతో టికెట్ విషయమై ఆయన పిలిపించారన్న ప్రచారం మొదలైంది. అల్లుడిని పోటీకి దించాలని మల్లారెడ్డిని సీఎం ఆదేశించినట్లు కార్యకర్తలు చెబుతున్నారు. ఇక్కడి సిటింగ్ ఎమ్మెల్యే మైనంపల్లి హనుంతరావు.. తన కుమారుడికి మెదక్ టికెట్ ఇవ్వనందుకు మంత్రి హరీశ్‌రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం, ఆయన కాంగ్రెస్‌లోకి వెళతారనే ప్రచారం జరుగుతుండడం తెలిసిందే. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థులుగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ పేర్లు తెరపైకి వచ్చాయి. అయితే తన అల్లుడికి అవకాశం కల్పించాలంటూ మంత్రి మల్లారెడ్డి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.









