శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లే కుటుంబ ప్రయాణికులకు డిస్కౌంట్
ముగ్గురు ఆపై ప్రయాణిస్తే పది శాతం డిస్కౌంట్
తెలంగాణ ఆర్టీసీ (TSRTC) ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించేందుకు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటుంది. సరికొత్త ప్యాకేజీలు, టికెట్ ధరలపై డిస్కౌంట్లు, కొత్త సర్వీసులతో ప్రయాణికులకు ఆక్యూపెన్సీ పెంచుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే టీ-9 టికెట్, టీ-24 టికెట్, ప్రత్యేక రోజుల్లో టికెట్ ధరలపై భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది. తాజాగా.. హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు ప్రయాణించే ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. వారి కోసం మరో బంఫర్ ఆఫర్ ప్రకటించింది. కనీసం ముగ్గురు ప్రయాణికులు కలిసి ప్రయాణం చేస్తే టికెట్ చార్జీల్లో డిస్కాంట్ ఇవ్వనున్నట్లు వెల్లడించింది. ముగ్గురు నుంచి ఎంతమంది ప్రయాణికులైనా.. సరే కలిసి ప్రయాణం చేసినప్పుడు మొత్తం చార్జీల్లో 10 శాతం వరకు డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ వెంకన్న వెల్లడించారు.
కుటుంబ సభ్యులు కలిసి వెళ్లినప్పుడు ప్రయాణించే దూరం, ప్రయాణికుల సంఖ్యను బట్టి డిస్కౌంట్ ఆఫర్ ఉంటుందని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. మరోవైపు టీఎస్ ఆర్టీసీ ప్రవేశపెట్టే కొత్త కొత్త ఆఫర్లతో ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్నట్లు కూడా అధికారులు వెల్లడించారు. ఈ నేపథ్యంలో పలు మార్గాలలో మరిన్ని కొత్త బస్సు సర్వీసులు నడిపేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టిందన్నారు. త్వరలో హైదరాబాద్ నగరానికి రానున్న కొత్త ఎలక్ట్రికల్ ఏసీ బస్సుల్లో 20 బస్సులను శంషాబాద్ ఎయిర్పోర్టుకు నడపనున్నట్లు ఆర్ఎం వెంకన్న వెల్లడించారు.
శ్రీదత్త క్షేత్రానికి ప్రత్యేక బస్సు..
ఈ నెల 17న (రేపు) అమావాస్య సందర్భంగా కర్ణాటకలోని గానుగాపూర్ దత్తాత్రేయ స్వామి ఆలయానికి భక్తుల సౌకర్యార్థం టీఎస్ఆర్టీసీ ప్రత్యేక సూపర్ లగ్జరీ బస్సును ఏర్పాటు చేసింది. గానుగాపూర్తో పాటు మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు పండరీపూర్, తుల్జాపూర్కు ఈ ప్రత్యేక లగ్జరీ బస్సును సంస్థ నడుపుతోంది. ఇవాళ సాయంత్రం 6 గంటలకు హైదరాబాద్ MGBS నుంచి గానుగాపూర్కు బస్సు బయలుదేరుతుంది. 18న మధ్యాహ్నం 2 గంటలకు తిరిగి హైదరాబాద్కు బస్సు తిరిగి రానుంది. గానుగాపూర్ ప్రత్యేక బస్సు టికెట్ ధరను రూ.2500గా TSRTC నిర్ణయించింది.









