ప్రాజెక్టు చీతాలో భాగంగా దక్షిణాఫ్రికా, నమీబియాల నుంచి తీసుకొచ్చిన చీతాల వరుస మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మధ్యప్రదేశ్‌లోని కునో జాతీయ పార్కులో మంగళవారం (జూలై 11) మరో చీతా మృతి చెందింది. 4 ఏళ్ల ఈ మగ చీతా పేరు తేజస్. నాలుగు నెలల వ్యవధిలో ఈ పార్కులో మృతి చెందిన ఆఫ్రికన్ చీతాల్లో ఇది ఏడోది. తేజస్ మెడపై గాయం ఉన్నట్లు మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో అటవీ శాఖ అధికారులు గుర్తించారు. వెంటనే వైద్యులను అప్రమత్తం చేసి దానికి చికిత్స అందించారు. మధ్యాహ్నం 2 గంటల సమయంలో అది మృతి చెందిందని అధికారులు తెలిపారు.
ఆధిపత్య పోరు కారణంగానే ఈ చీతా మరణించి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ‘తేజస్ మెడ భాగంలో ఉన్న గాయాలపై దర్యాప్తు చేస్తున్నాం. మరణానికి అసలు కారణం ఏంటనేది పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంది’ అని అని చీఫ్ కన్జర్వేటివ్ అధికారి జేఎస్ చౌహాన్ అన్నారు.
‘ప్రాజెక్ట్ చీతా’ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం నమీబియా, దక్షిణాఫ్రికాల నుంచి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానాల్లో రెండు విడతల్లో 20 చీతాలను భారత్‌కు తీసుకొచ్చింది. తొలుత వీటిని ఎన్క్లోజర్లలో ఉంచి, ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా కునో జాతీయ పార్క్‌లోకి వదిలేశారు.









