ఏపీలో టెన్త్ పాసైన విద్యార్థులకు జగన్ సర్కార్ శుభవార్త చెప్పింది. ఈ నెల 12నుంచి 17 వరకూ జగనన్న విద్యా కానుక వారోత్సవాలు నిర్వాహించాలని కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. పది పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు జగనన్న ఆణిముత్యాలు అవార్డులను ప్రదానం చేసేందుకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాది టెన్త్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ‘జగనన్న ఆణిముత్యాల’ పేరుతో జూన్ 15న నియోజకవర్గ స్థాయిలో.. అలాగే 17న జిల్లా, 20న రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం ఘనంగా సన్మానించనున్నారు.
అంతేకాదు విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు చేస్తోన్న ప్రభుత్వం.. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందిస్తూ ‘టోఫెల్’ పరీక్షలకు సిద్ధం చేయనుంది. టోఫెల్ ప్రైమరీ (3–5 తరగతులు).. అలాగే టోఫెల్ జూనియర్ (6–10 తరగతులు) పరీక్షలు నిర్వహించి సర్టిఫికెట్ అందజేస్తారు. ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు బోధించే ఇంగ్లీష్ టీచర్‌ను ప్రభుత్వం 3 రోజుల శిక్షణ కోసం అమెరికాకు పంపిస్తుంది. ఈ మేరకు పరీక్షల నిర్వహణకు ఈటీఎస్‌తో ఒప్పందానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ప్రతి మండలానికి రెండు జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయనున్నారు. ఒకటి ప్రత్యేకంగా బాలికల కోసం.. మరొకటి కో ఎడ్యుకేషన్ విధానంలో ఏర్పాటు చేస్తారు. ఈనెల 12న జగనన్న విద్యాకానుకతోపాటు 28 నుంచి వారం రోజుల పాటు ‘అమ్మఒడి’ కార్యక్రమాలు చేపట్టనున్నారు.









