ట్రిపుల్ వన్ జీవో ఎత్తివేతతో ఆ పరిధిలో గ్రామస్థులు పండగ చేసుకుంటున్నారు. రెండు దశబ్దాల కల నెరవేరిందంటూ బాణాసంచ కాల్చి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కేబినెట్ జీవో ట్రిపుల్ వన్‌నె ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో ట్రిపుల్ వన్ జీవో కోసం ఎదురు చూస్తున్న వారికి బిగ్ రిలీఫ్ లభించింది. జీవో ఎత్తివేత కోసం ఎన్నో పోరాటాలు. ఆ తర్వాత ఎత్తివేతకు కూడా ఆందోళనలు సాగాయి. ఎట్టకేలకు లాభనష్టాలపై ఒక అంచనాకు వచ్చిన ప్రభుత్వం ట్రిపుల్ వన్ జీవోను ఎత్తివేసింది. ఈ జీవో పరిధిలోకి వచ్చే గ్రామాల్లో ఇక అంతా ఓపెన్.
హైదరాబాద్‌లోని జంట జలాశయాల రక్షణ కోసం 1996 మార్చి 8న 111 జీవో తీసుకొచ్చింది. రాజేంద్రనగర్, చేవెళ్ల అసెంబ్లి నియోజకవర్గాల్లో దాదాపు 10 కి.మీటర్ల రేడియస్ కలిగి ఉంది. 7 మండలాల్లో లక్షా 30 వేల ఎకరాల భూమి ఉంది. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ పరివాహక ప్రాంతాలను కాపాడడం కోసం జీవో తెచ్చారు. మొత్తం10 కి.మీటర్ల రేడియస్‌లో కాలుష్య కారక ఫ్యాక్టరీలు, హోటళ్లు నిర్మాణానికి వీలులేదు. క్యాచ్ మెంట్ ఏరియాలో వేసే లే ఔట్లలో 60 శాతం ఓపెన్ ప్లేస్ ఉండాలి. ఇక భూమిలో 90 శాతం కన్జర్వేషన్ కోసం కేటాయించాలి. జీ ప్లస్ 2కి మించి నిర్మాణాలు చేపట్టరాదు. మొయినాబాద్, శంషాబాద్, షాబాద్, కొత్తూరు, రాజేంద్రనగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల మండలాల్లో ఈ నిబంధనలు పెట్టారు.
అయితే సిటీ శరవేగంగా అభివృద్ధి జరగడంతో 111ను తుంగలో తొక్కి అక్రమ నిర్మాణాలు వెలిశాయి. గత పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలోనే 111 జీవోపై నిర్ణయం తీసుకుంటామని కేసీఆర్ ప్రకటించారు. ప్రతి సంవత్సరం రియల్ ఎస్టేట్ వ్యాపారం జోరుగా సాగడం, విచ్చల విడిగా నిర్మాణాలు, బహుళ అంతస్తులు, బడా బాబుల ఫాం హౌజ్‌ల అడ్డాలుగా మారింది. ఇది పర్యావరనానికి తీవ్రంగా నష్టం వాటిల్లుతుందని ఎన్జీవో సంస్థలు కోర్టును ఆశ్రయించాయి. 111 జీవో పై వేసిన ఎక్స్‌పర్ట్ కమిటీ రిపోర్ట్‌ను చూసి ఎత్తివేస్తామని కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించారు. భవిష్యత్తులో హైదరాబాద్ తాగునీటికి సమస్య రాదని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హైదరాబాద్‌కు ఉస్మాన్‌సాగర్, హిమాయత్‌సాగర్ జలాలు నీళ్లు అవసరం లేదని గోదావరి, కృష్ణా జలాలే పుష్కలంగా ఉన్నాయని తెలిపింది.









