అసలే ద్రవ్యోల్బణం.. ఆపై దెబ్బతిన్న పంటలు.. మరోవైపు ఉక్రెయిన్ – రష్యా యుద్ధం.. ఇవన్నీ ఇప్పుడు పాకిస్థాన్‌లోని పేదల పాలిట శాపంగా మారాయి. ఎంతలా అంటే.. పవిత్ర రంజాన్ మాసం వేళ కనీసం ఇఫ్తార్ చేసుకునే పరిస్థితి కూడా లేదు. బియ్యం, పిండి, పండ్లు, మాంసం ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో ఉచితంగా పంపిణీ చేసే వారి కోసం పేదలు ఎదురుచూస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు ఆదుకోకపోతే.. పవిత్ర రంజాన్ మాసంలో కూడా పస్తులు ఉంటున్నారు.
స్వచ్ఛంద సంస్థలే దిక్కు..
కరాచీలోని స్వచ్ఛంద సంస్థల గేట్‌ల వెలుపల వందలాది మంది పురుషులు, మహిళలు పడిగాపులు కాస్తున్నారు. పవిత్ర రంజాన్ మాసంలో తమ ఉపవాసాన్ని విరమించుకోవడానికి.. తగినంత పిండి, బియ్యం, పంచదార, వంట నూనెల కోసం చాలా మంది గంటల తరబడి కూర్చుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు నిత్యావసరాలు పంపిణీ చేస్తే.. ఆ రోజు ఇఫ్తారు ఉంటుంది. లేకపోతే లేదు. అక్కడా తొక్కిసలాటలు జరుగుతున్నాయి. ఇటీవల జరిగిన తొక్కిసలాటలో 12 మంది చనిపోయారు. ‘ఇది మా జీవితంలో అత్యంత ఖరీదైన, భరించలేని రంజాన్’ అని పాకిస్థాన్ ప్రజలు చెబుతున్నారు.
పాకిస్థాన్ అంతటా రంజాన్ సీజన్‌లో కాస్త ధరలు పెరుగుతాయి. ముఖ్యంగా పండ్లు, మాంసం ధరలు పెరుగుతాయి. కానీ.. ఈ సంవత్సరం వస్తువుల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి. ఎంతలా అంటే.. గతేడాది రంజాన్ మాసంలో.. 20 కేజీల పిండి ధర రూ.1100 ఉంది. కానీ.. ఇప్పుడు 20 కేజీల పిండి ధర రూ.2800 అయ్యింది. ఆర్థిక సంక్షోభం ఈ స్థాయిలో ఉంది. దీంతో రోజువారీ ఉపవాసాన్ని విరమించుకోవడానికి అవసరమైన ఖర్జూరాలు, బియ్యం, మాంసం కొనడానికి లక్షలాది కుటుంబాలు కష్టపడుతున్నాయి. వేలాది మంది రంజాన్ వేడుకలకు దూరంగా ఉంటున్నారు.









