AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నీట్ లీకేజీ కేసులో కదిలిన డొంక..! 20వేల పేజీలతో సీబీఐ ఛార్జ్‌షీట్..!

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నీట్​ పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీ కేసులో సీబీఐ ఢిల్లీలోని ఫాస్ట్​ ట్రాక్​ కోర్టుకు ఛార్జ్​ షీట్​ సమర్పించింది. 20వేల పేజీలతో రూపొందించిన ఛార్జ్​ షీట్​ లో పలు సంచలన వివరాలను పేర్కొంది. దీనికి 360 మంది సాక్షుల వాంగ్మూలాలు, 422 కీలక డాక్యుమెంట్లు.. 43 డిజిటల్​, ఫిజికల్​ ఆధారాలను జత చేసింది. ఈ కేసులో మెుత్తం 13 మందిని నిందితులుగా పేర్కొంది. వీరిలో ముగ్గురు ప్రశ్నా పత్రాల నిపుణులు కాగా.. ఇద్దరు కోచింగ్‌ సెంటర్ నిర్వాహకులు, మధ్యవర్తులు, లబ్ధి పొందిన అభ్యర్థులు ఉన్నట్టు తెలియచేసింది.

వీరందరిపై బీఎన్‌ఎస్‌ చట్టం ప్రకారం నేరపూరిత కుట్ర, మోసం, నమ్మక ద్రోహం, సాక్ష్యాల ధ్వంసం తదితర సెక్షన్లతోపాటు అవినీతి నిరోధక చట్టం, పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ చట్టం-2024 చట్టం ప్రకారం కూడా అభియోగాలు నమోదు చేసింది. ప్రస్తుతం ఛార్జ్‌ షీట్‌లో పేరున్న 13 మంది నిందితులు జ్యుడిషియల్​ రిమాండ్‌లో ఉన్నారని దర్యాప్తు అధికారులు తెలిపారు. డిజిటల్‌ ఫోరెన్సిక్‌ విశ్లేషణ, చేతిరాత నిపుణుల అభిప్రాయాలు, విద్యా నిపుణుల సాంకేతిక నివేదికలను కూడా ఛార్జ్‌ షీట్‌కు జత చేసినట్టు పేర్కొన్నారు. పరీక్షకు ముందే ప్రశ్నా పత్రాలు లీకై నిందితుల ద్వారా పంపిణీ అయినట్టు ఈ నివేదికలు నిర్ధారించాయని వెల్లడించారు.

నీట్ పేపర్ లీక్ పై దర్యాప్తులో భాగంగా సీబీఐ అధికారులు మహారాష్ట్ర, రాజస్థాన్‌, హర్యానా, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లోని 92 ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. రెండు నెలల దర్యాప్తులో ప్రశ్నా పత్రాల లీక్‌ మూలకారకులు ఎవరు? దీనివల్ల ప్రయోజనం పొందినవారు ఎవరు? అన్నదానికి సంబంధించి నెట్‌ వర్క్‌ను గుర్తించారు. ఈ కేసులో ఎన్‌టీఏకు చెందిన ముగ్గురు సబ్జెక్ట్‌ నిపుణులు పీ.వీ. కులకర్ణి (కెమిస్ట్రీ), మనీషా గురునాథ్‌ మంధారే (బయాలజీ), మనీషా సంజయ్‌ హవల్దార్‌ (ఫిజిక్స్‌)ను సీబీఐ నిందితులుగా పేర్కొంది.

అలాగే మహారాష్ట్ర లాతూర్‌ కు చెందిన వైద్యుడు మనోజ్‌ షిరురే, పుణేలోని డాక్టర్‌ అభంగ్‌ ప్రభు మెడికల్‌ అకాడమీకి చెందిన ఫిజిక్స్‌ ప్రొఫెసర్​ తేజస్‌ హర్షద్‌ కుమార్‌ షా, లాతూర్‌కు చెందిన కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకుడు శివరాజ్‌ రఘునాథ్‌ మోటేగావ్‌ కర్‌ లను కూడా అధికారులు ఛార్జ్‌ షీట్‌లో నిందితులుగా చేర్చారు. విచారణలో వీళ్లు వెల్లడించిన వివరాల ఆధారంగా ప్రశ్నాపత్రం లీకేజీలో మధ్యవర్తులుగా వ్యవహరించిన వారిని కూడా అరెస్ట్​ చేశారు. ఈ క్రమంలోనే నిందితుల ఆర్థిక లావాదేవీలపై విచారణ జరిపి వారి బ్యాంకు అకౌంట్లు, లాకర్లు, డీమ్యాట్‌ ఖాతాలను ఫ్రీజ్​ చేశారు.

ఇదిలా ఉంటే సీబీఐ దాఖలు చేసిన ఛార్జ్​ షీట్ పై గురువారం (ఆగస్టు 13) దిల్లీ ఫాస్ట్​ ట్రాక్​ కోర్టులో వాదనలు జరుగనున్నాయి. ఇటీవల కేంద్ర ప్రభుత్వం లోక్​ సభలో ప్రవేశపెట్టి ఆమోదం పొందిన పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) సవరణ బిల్లు-2026ను బిల్లు ప్రకారం ఛార్జ్​ షీట్​ సమర్పించిన మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాల్సి ఉంది.

ANN TOP 10