తెలంగాణ జైళ్ల చరిత్రలో తొలిసారిగా ఎన్‌ఐఓఎస్ (NIOS) ద్వారా 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. ఖైదీల్లో విద్యాభ్యాసాన్ని, పునరావాసాన్ని ప్రోత్సహించేందుకు జైళ్ల శాఖ చేపట్టిన కార్యక్రమం సత్ఫలితాలను ఇచ్చింది.
చర్లపల్లి కేంద్ర కారాగారం నుంచి 56 మంది, నిజామాబాద్ జైలు నుంచి 15 మంది, హైదరాబాద్ ప్రత్యేక మహిళా కారాగారం నుంచి ఏడుగురు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారు. ఈ సందర్భంగా జైళ్ల శాఖ డీజీ డా. సౌమ్య మిశ్రా ఉత్తీర్ణులైన ఖైదీలకు ధ్రువపత్రాలను అందజేసి అభినందించారు. విద్యపై ఖైదీలు చూపిన పట్టుదలకు గుర్తింపుగా 78 మందికి ప్రత్యేక రిమిషన్ ప్రకటించారు.
శిక్ష అనుభవిస్తున్నప్పటికీ విద్యను కొనసాగించి విజయాన్ని సాధించడం అభినందనీయమని డీజీ పేర్కొన్నారు. ఉత్తీర్ణులైన ఖైదీలు తదుపరి 10 +2, డిగ్రీ, ఐటీఐ తదితర వృత్తి విద్యా కోర్సులు కొనసాగించేలా ప్రోత్సహిస్తామని డీజీ తెలిపారు. విద్య ద్వారా జీవితంలో సానుకూల మార్పు తీసుకువచ్చి, భవిష్యత్తులో స్వయం ఆధారితంగా ఎదగాలని సూచించారు. ఖైదీలలో పరివర్తన తీసుకురావడంలో విద్య కీలక పాత్ర పోషిస్తుందని, ఇలాంటి కార్యక్రమాలను భవిష్యత్తులోనూ కొనసాగిస్తామని జైళ్ల శాఖ అధికారులు తెలిపారు.








