మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. గుండెపోటు (Heart Attack)తో తహసీల్దార్ ఆకస్మికంగా మృతి చెందారు. కేసముద్రం ఎమ్మా్ర్వోగా విధులు నిర్వహిస్తున్న ఫరీద్దున్.. రంజాన్ పండుగ పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో మండల కేంద్రంలో గత రాత్రి ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి విందులో పాల్గొ్న్న ఎమ్మార్వో ఫరుద్దీన్ ఇంటికి వెళ్లిన కాసేపటికే అస్వస్థకు గురయ్యాడు. అనంతరం వెంటనే ఇంటికి రావాలని కారు డ్రైవర్‌కు ఫోన్ చేశాడు. ఇంటికి చేరుకున్న డ్రైవర్ అతడిని సమీపంలోని ఓ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే శంకర్ నాయక్.. మహబూబాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి తహసీల్దార్ ఫరీదుద్దీన్‌కు మెరుగైన చికిత్సను అందించాలని డాక్టర్లకు సూచించారు. వైద్యులు చికిత్స అందిస్తుండగానే ఆయన ప్రాణాలు కోల్పాయారు. ఎమ్మార్వో మృతిపై శంకర్ నాయకు విచారం వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందులో కాసేపటి క్రితమే ఆయన పాల్గొన్నారని.. అందరికి స్వయంగా వడ్డించారన్నారు. గుండె పోటుతో ఇలా ఆకస్మికంగా మృతి చెందటం బాధాకరమని అన్నారు. వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపిన.. శంకర్ నాయక్ ప్రభుత్వం తరఫున వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.









