ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. అమర వీరుల స్థూపం సాక్షిగా పోడు భూములపై ఆమె మాట ఇచ్చారు. అధికారంలో వచ్చిన వెంటనే 4 నెలల్లో 13 లక్షల పట్టాలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. 1981వ సంవత్సరంలో భూమి, భుక్తి, విముక్తి కోసం ఆదివాసీ రైతు కూలీ ఉద్యమ కారులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారని.. న్యాయం కోసం పోరాడి పోలీసుల తూటాలకు బలయ్యారని షర్మిల గుర్తు చేశారు. అమరులైన ఆదివాసీ గిరిజనులను గుర్తు చేసుకుంటుూ అమరుల స్థూపం వద్ద నివాళులు అర్పిస్తుంటారని చెప్పారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదని.. పంటలు లేవు, ఉద్యోగాలు లేవని షర్మిల అన్నారు. వైఎస్సార్ పాదయాత్ర చేసి.. పోడు సమస్యలు తెలుసుకున్నారని.. అధికారంలోకి వచ్చిన వెంటనే 3.30 లక్షల ఎకరాలకు పట్టాలు ఇచ్చారని గుర్తు చేశారు. వైఎస్సార్ బ్రతికి ఉంటే మిగిలిన 4 లక్షల ఎకరాలకు కూడా పట్టాలు ఇచ్చేవారని అన్నారు. వైఎస్సార్ మరణాంతరం అప్పుడున్న కాంగ్రెస్, ఇప్పుడు ఉన్న కేసీఆర్ ఒక్క ఎకరానికి కూడా పట్టా ఇవ్వలేదన్నారు. పోడు భూములకు పట్టాలు ఇస్తాం అని కేసీఆర్ మాట ఇచ్చి.. తప్పారని అన్నారు. కేసీఆర్ ఒక చేతకాని ముఖ్యమంత్రి అని.. ఆయనకు ప్రజల పట్ల చిత్తశుద్ది లేదని విమర్శించారు. వైఎస్సార్ బిడ్డగా మాట ఇస్తున్నానని.. అధికారంలోకి వచ్చిన వెంటనే పోడు భూములకు పట్టాలు ఇస్తానని చెప్పారు.









