హైదరాబాద్: ‘జేజమ్మ’ టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసిన పాత్ర ఇది. అనుష్క శెట్టి ప్రధాన పాత్రలో నటించిన ‘అరుంధతి’ సినిమాలోని ఈ పాత్రకు మొదట దర్శకుడు తననే అడిగారని తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నటి ప్రేమ తెలిపారు. పాత్ర నచ్చినప్పటికీ కన్నడలో బిజీగా ఉండటం వల్ల తాను దీనిని వదులుకోవాల్సి వచ్చిందని ఆమె వివరించారు. దర్శకుడు కోడి రామకృష్ణ గారితో నాకు ప్రత్యేక అనుబంధం ఉంది. ఆయన తెరకెక్కించిన ‘దేవి’తో నాకు తెలుగునాట మంచి గుర్తింపు వచ్చింది. ఆయనే నాకు తెలుగు నేర్పించారు. ‘అరుందతి’ సినిమా అనుకున్నప్పుడు ‘జేజమ్మ’ (మహారాణి అనుష్క) పాత్ర కోసం ఆయన నన్ను సంప్రదించారు. వరుసగా కొన్నిరోజులపాటు డేట్స్ అడిగారు. అదే సమయంలో నేను కన్నడలో పలు సినిమాలు చేస్తున్నాను. దానివల్ల డేట్స్ సర్దుబాటు చేయడం వీలుపడలేదు. ఆ సినిమా విడుదలయ్యాక చూశాను. నాకెంతో నచ్చింది. అయితే, ‘జేజమ్మ’ పాత్రను చేయలేకపోయినందుకు నేనేమీ బాధపడటం లేదు. ఆ పాత్ర ఆమెకు రాసి పెట్టి ఉంది అని ప్రేమ వివరించారు.
తన సినీ కెరీర్ గురించి మాట్లాడుతూ.. సినిమాల్లోకి రావాలని నేనస్సలు అనుకోలేదు. ఎయిర్ హోస్టెస్ కావాలనేది నా కల. అయితే, మా అమ్మకు నన్ను ఓ నటిగా చూడాలని ఉండేది. ఆ విషయంలో మా ఇద్దరికీ గొడవ అవుతుండేది. ఆమె కోరికను ఎందుకు తీర్చకూడదనిపించి మొదటిసారి సవ్యసాచి’ అనే కన్నడ సినిమాలో నటించా. నటిగా తొలి ప్రయత్నంలోనే పరాజయం అందుకున్నా. అయినప్పటికీ, ‘ఓం’లో అవకాశం వచ్చింది. ఆ సినిమా సూపరిహిట్. నాకు వరుస అవకాశాలు వచ్చాయి. ‘ధర్మచక్రం’తో తెలుగులోకి ప్రవేశించా. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’, ‘క్షణ క్షణం’ లాంటి సినిమాలు చేయలేకపోయాననే బాధ ఉంది. కెమెరా ముందు కనిపించడం కోసం ఏదో ఒక పాత్రను పోషించడం నాకు ఇష్టం లేదు. వైవిధ్యమైన పాత్రల్లో నటించాలని ఉంది’’ అని ప్రేమ పేర్కొన్నారు.