ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR)పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. శుక్రవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆమె ఘనంగా నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ ఎన్నికలు దగ్గరకు వచ్చాక అంబేద్కర్ విగ్రహం (Ambedkar Statue) వచ్చిందని, తెలంగాణలో కేసీఆర్ రాజ్యాంగం (KCR Constitution) నడుస్తోందన్నారు. రాజ్యాంగం ఎందుకు మార్చాలో సీఎం కేసీఆర్ చెప్పాలన్నారు. ముఖ్యమంత్రి కుటుంబంలో ఐదు ఉద్యోగాలు ఉన్నాయని విమర్శించారు. విగ్రహం పెట్టినంత మాత్రాన దళితులపై ప్రేమ ఉన్నట్టు కాదన్నారు.
సీఎం కేసీఆర్ రాజ్యాంగంలో ప్రజలకు హక్కులు లేవని, ఆయన రాజ్యాంగాన్ని అవమాన పరిచారని షర్మిల అన్నారు. బీఆర్ఎస్ రాజ్యాంగంలో ప్రతిపక్షాలకు కొట్లాడే హక్కు లేదని, దళితులను అన్ని రకాలుగా సీఎం కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణ ఒక ఆఫ్గనిస్తాన్ అని, సీఎం ఒక తాలిబాన్ నేతని అన్నారు. అసలు తెలంగాణలో రాజ్యాంగం ఉందా? అని ప్రశ్నించారు. ఇండియన్ రాజ్యాంగాన్ని తెలంగాణలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షాలకు కొట్లాడే స్పేస్ ఇవ్వాలన్నారు. కేసీఆర్ అంబేద్కర్ వారసుడని అంటున్నారని.. దీనికంటే పెద్ద జోక్ ఇంకొకటిలేదన్నారు. దళితులను జైల్లో చిత్రహింసలు పెట్టి చంపుతున్నారని, అన్ని పాలసీలకు దళితుల భూమి దోచుకుంటున్నారని ఆరోపించారు. అంబేద్కర్ వారసుడనని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రికి సిగ్గు ఉండాలని షర్మిల వ్యాఖ్యానించారు.