AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘టీఆర్ఎస్’లో చేరిన మాజీ మంత్రి బోడ జనార్థన్..!

సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట కవిత చెప్పారు. ఇది తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కు చెందిన సీనియర్ నాయకులు, మాజీ మంత్రి బోడ జనార్థన్ తో పాటు ఆయన అనుచరులు గురువారం టీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలో కవిత బంజారాహిల్స్ లోని పార్టీ కార్యాలయంలో వారికి కండువాలు టీఆర్ఎస్ లోకి ఆహ్వానించారు.

 

కవిత మాట్లాడుతూ..

 

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ రాజకీయాల్లో అపార అనుభవం ఉన్న బోడ జనార్దన్ చేరికతో టీఆర్ఎస్ కు మరింత బలం చేకూరిందన్నారు. చిన్న వయసులోనే కార్మిక శాఖ మంత్రిగా, ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేసిన జనార్థన్.. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికుల కోసం ఎంతో కృషి చేశారన్నారు. ఆయన హోదాకు తగిన విధంగా పార్టీలో ప్రాధాన్యం ఇస్తామన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి, ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తూ కర్కషంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.

 

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి

 

తెలంగాణ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టించేందుకు ఏర్పడిందే తెలంగాణ రక్షణ సేన అని కవిత అన్నారు. సబ్బండ తెలంగాణ వర్గాల గతి మార్చే అభివృద్ధి ప్రణాళికను తయారు చేస్తున్నామని… త్వరలోనే ఆ ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇందుకోసం చాలా సీరియస్ గా కసరత్తు చేస్తున్నామన్నారు. తాము తీసుకురాబోయే ప్రణాళిక తెలంగాణలో విప్లవాత్మక మార్పులు తెస్తుందని కవిత చెప్పారు. తమ పార్టీ సమసమాజ స్థాపన కోసం ఏర్పడిందని చెప్పారు. తమ పార్టీ ఖచ్చితంగా తెలంగాణ ప్రజల ఇంటి పార్టీగా మారుతుందని చెప్పారు.

 

బ్రిడ్జ్ పనులు ప్రారంభించాలి.. కవిత

 

ప్రశ్నించటం, పోరాడటం, పరిష్కరించటం అనే విధానంతో ముందుకు వెళ్తున్నట్టు చెప్పారు. కొంతమంది ప్రశ్నిస్తారు. మరికొంతమంది పోరాటం చేస్తారు. కానీ తమ పార్టీ ప్రశ్నించి, పోరాడి, పరిష్కరించే వరకు సమస్యను వదిలి ట్టదన్నారు. జనం బాట కార్యక్రమం లో ప్రస్తావించిన సమస్యల్లో 25 సమస్యలకు పరిష్కారం లభించిదని గుర్తు చేశారు. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్ట్ ను ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఉద్యమాలు చేయకండి మేము పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారన్నారు. నల్గొండలో 35 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న బ్రిడ్జి పనులను జనంబాటలో ప్రస్తావించగా ఇప్పుడు ఆ బ్రిడ్జి పనులను ప్రారంభించారని కవిత గుర్తు చేశారు.

 

కార్మికులకు తీరని అన్యాయం..

 

సింగరేణి, ఆర్టీసీ సహా అన్ని రంగాల్లోని కార్మికులను రేవంత్ సర్కార్ ఘోరంగా మోసం చేస్తోందని కవిత ఆరోపించారు. కార్మికులకు కనీస వేతనాలను ఫిక్స్ చేశామని, గతంలో ఎవరు ఇలా చేయలేదని ముఖ్యమంత్రి చెబుతున్నారన్నారు. కానీ ఆయన మినిమమ్ వేజేస్ పేరుతో పచ్చి దగా చేశారన్నారు. ఆరేళ్ల క్రితమే మల్కాజ్ గిరి ఎంపీగా ఉన్నప్పుడు అప్పటి సీఎం కు కార్మికులకు మినిమమ్ వేజేస్ 20 వేలు ఉండాలని రేవంత్ రెడ్డి లేఖ రాశారని చెప్పారు. ఆయన లేఖలో ఏదైతే కేటగిరీ చెప్పారో ఆ కేటగిరీకి ముఖ్యమంత్రి అయ్యాక రేవంత్ రెడ్డి రూ. 16 వేల వేతనం ఫిక్స్ చేశారన్నారు.

 

కాంగ్రెస్ పార్టీపై కవిత ఫైర్

 

అంటే ఆరేళ్ల తర్వాత నాలుగు వేలు తగ్గించి 16 వేల వేతనం ఇస్తామని గొప్పగా చెబుతుండటం కార్మికులను నయవంచనకు గురిచేయటమేనని చెప్పారు. ఇక సింగరేణిలో కార్మికుల చెమట, రక్తాన్ని పీల్చి మరి దోపిడీకి పాల్పడుతున్నారని విమర్శించారు. ఒక్క రూపాయి తో అయ్యే పనికి పది రూపాయలు ఖర్చు చేస్తూ అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ వచ్చాక మనం డిపెండెంట్ ఉద్యోగాలు సాధించుకున్నాం. కానీ కాంగ్రెస్ వాటిని పొగొట్టే పనిచేస్తోందని మండిపడ్డారు. ఐఎన్ టీయూసీ, దాని తోక పార్టీ తో అధికారం చెలాయిస్తూ కార్మికుల హక్కులను కాలరాస్తోందని విమర్శించారు. బోడ జనార్థన్ రాకతో మా హెచ్ఎంఎస్ కు సింగరేణిలో మరింత బలం వస్తుందన్నారు. ఆయన సహకారంతో సింగరేణి కార్మికుల కోసం ప్రభుత్వంపై మరింత గట్టిగా పోరాటం చేస్తామని కవిత చెప్పారు.

 

ఆర్టీసీ విలీనం ఊసే లేదు..

 

రేవంత్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను కూడా అన్యాయం చేస్తోందన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని చెప్పి రెండున్నరేళ్లు మొద్దు నిద్రపోయారని విమర్శించారు. రాజు గౌడ్ అనే ఆర్టీసీ డ్రైవర్ బలిదానం చేసుకునే వరకు కూడా విలీనం ఊసే ఎత్తలేదన్నారు. ఇటీవల పెట్రోల్ ధరలపై ధర్నా చేస్తున్న కాంగ్రెస్ నాయకులను ముందు వడ్లు కొనాలని సూచించినందుకు ఓ ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేశారని ఆవేదన వ్యక్తం చేశారు. మళ్లీ మేమంతా పోరాటం చేస్తే వెనక్కి తగ్గారని చెప్పారు. అంటే ప్రశ్నిస్తే తట్టుకోలేని కర్కష పాలన ఈ రాష్ట్రంలో జరుగుతోందని మండిపడ్డారు. ఆర్టీసీ ఛైర్మన్ గా పనిచేసిన బోడ జనార్థన్ సహకారంతో ఆర్టీసీ కార్మికుల కోసం కూడా పోరాడుతామన్నారు.

 

ఆ ఇద్దరికన్నా ఉన్నతంగా ఆలోచించారు..

 

ఒక మహిళ నాయకురాలు పార్టీ పెట్టి ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తానని ముందుకు రావటం చాలా ధైర్యంతో కూడిన విషయమని మాజీ మంత్రి బోడ జనార్దన్ అన్నారు. అప్పట్లో ఎన్టీఆర్ కూడు, గూడు, గుడ్డ అనే మూడు అంశాలతో అధికారంలోకి రాగా ఆ తర్వాత కేసీఆర్ గారు నీళ్లు, నిధులు, నియామకాలు అంటూ మూడు అంశాలతో అధికారంలోకి వచ్చారని చెప్పారు. కానీ కవిత మాత్రం పాంచజన్యం అంటూ ఐదు కీలకమైన అంశాలతో ఆ ఇద్దరు నాయకుల కన్నా ఉన్నతంగా ఆలోచించారని చెప్పారు. కవిత ప్రకటించిన మేనిఫెస్టో నచ్చి టీఆర్ఎస్ లో చేరుతున్నాన్నారు. రాష్ట్రానికి మహిళ సీఎం అయితే ఎంతో అభివృద్ధి ఉంటుందని చెప్పారు. ఇక నుంచి కాంగ్రెస్ పై పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ.. టీఆర్ఎస్ ను బలోపేతం చేసేందుకు కష్టపడి పనిచేస్తానని చెప్పారు.

ANN TOP 10