నీట్ పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. రోజురోజుకూ విద్యార్థుల ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తుండటంతో, కేంద్ర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. పరిస్థితి చేయి దాటిపోకుండా ఉండేందుకు నిరసనకారులతో మాట్లాడేందుకు ముందడుగు వేసింది.
నిరసనకారులకు కేంద్రం ఆఫర్
ఉద్యమాన్ని శాంతింపజేసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థులకు, కాక్రోచ్ జనతాపార్టీ (సీజేపీ) నాయకులకు చర్చల పిలుపునిచ్చింది. ఈ మేరకు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ మాట్లాడుతూ.. ఆందోళనకారులకు అనుకూలమైన సమయంలో ఎప్పుడైనా వచ్చి చర్చల్లో పాల్గొనవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికే నాలుగు కీలక ప్రతిపాదనలను నిరసనకారుల ముందుకు తెచ్చిందని, వాటిపై సమగ్రంగా మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు.
జితేంద్ర సింగ్ హామీ..
విద్యార్థుల ప్రతినిధులు ఎవరైనా వచ్చి ప్రభుత్వంతో మాట్లాడొచ్చని సూచించారు. ఈ చర్చలలో కేంద్ర మంత్రి జేపీ నడ్డాతో పాటు తాను కూడా నేరుగా పాల్గొంటానని జితేంద్ర సింగ్ వెల్లడించారు. జేపీ నడ్డా నివాసంలో గానీ లేదా ఆయన కార్యాలయంలో గానీ సమావేశం ఏర్పాటు చేసుకోవచ్చని చెప్పారు. అసలు చర్చలు మొదలైతేనే ఏ సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని, విద్యార్థుల భవిష్యత్తు, సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
6:30 గంటలకే షాపులు బంద్
మరోవైపు ఢిల్లీలో సీజేపీ చేపట్టిన ఆందోళనలు తీవ్రమవ్వడంతో న్యూదిల్లీ ట్రేడర్స్ అసోసియేషన్ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టింది. నిరసనల తీవ్రత ఎక్కువగా ఉన్న కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో గురువారం సాయంత్రం 6:30 గంటలకే షాపులు, ఆఫీసులు మూసివేయాలని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేసింది.
ఈ పరిణామంపై ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా స్పందించారు. ఎన్డీటీఏ నిర్ణయానికి సంబంధించిన విషయాన్ని ఎక్స్ వేదికగా షేర్ చేస్తూ కేంద్ర తీరుపై మండిపడ్డారు. వేళకంటే ముందే దుకాణాలు మూసివేయించడమే కాకుండా, జంతర్ మంతర్ వద్ద భారీగా పోలీసులను మోహరించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వం మరోసారి బలప్రయోగానికి పాల్పడేందుకు కుట్ర చేస్తోందని కేజ్రీవాల్ ఆరోపించారు.








