AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

క్వాంటం పరిశోధనలకు అమరావతి బెస్ట్ ప్లేస్… క్వాంటినమ్ సీఈఓతో సీఎం చంద్రబాబు భేటీ..

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ రంగంలో గ్లోబల్ హబ్‌గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా, ముఖ్యమంత్రి చంద్రబాబుతో అంతర్జాతీయ ఫుల్ స్టాక్ క్వాంటం కంప్యూటింగ్ సంస్థ ‘క్వాంటినమ్’ సీఈఓ రాజీబ్ హజ్రా, ఇతర ప్రతినిధులు సచివాలయంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. క్వాంటం పరిశోధనలకు, ఆవిష్కరణలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

 

భవిష్యత్ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భాగంగా అమరావతిలో ‘క్వాంటం వ్యాలీ’ని ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ ఏడాది డిసెంబరు నాటికి అమరావతి క్వాంటం కంప్యూటింగ్ కేంద్రం కార్యకలాపాలు ప్రారంభిస్తుందని, ఇప్పటికే రాష్ట్రంలో క్వాంటం టెస్టింగ్ ఫెసిలిటీలు పనిచేస్తున్నాయని వెల్లడించారు. గతంలో ఐటీని ప్రోత్సహించామని, ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), క్వాంటం టెక్నాలజీలతో సమస్యలకు వేగంగా పరిష్కారాలు అందించడమే తమ లక్ష్యమని ఆయన వివరించారు.

 

జాతీయ క్వాంటం మిషన్‌కు అనుగుణంగా, ప్రపంచస్థాయి ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేందుకు ఏపీతో వ్యూహాత్మక భాగస్వామ్యంపై క్వాంటినమ్ సంస్థ తీవ్ర ఆసక్తి వ్యక్తం చేసింది. క్వాంటం నైపుణ్యాభివృద్ధి, ఏఐ ఆధారిత క్వాంటం అప్లికేషన్లు, అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ రీసెర్చ్, స్టార్టప్ ఇంక్యుబేషన్ వంటి రంగాల్లో కలిసి పనిచేయాలని సీఎం చంద్రబాబు సూచించారు.

 

ఏపీలో క్వాంటం కంప్యూటర్ పరికరాల తయారీ నుంచి అల్గారిథమ్‌ల అభివృద్ధి వరకు పూర్తిస్థాయిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని క్వాంటినమ్ ప్రతినిధులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో క్వాంటినమ్ సంస్థ ఉపాధ్యక్షుడు సీతారామకృష్ణ, అమరావతి క్వాంటం మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

ANN TOP 10