ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దశాబ్దాలుగా సరిహద్దు వివాదాలతో, నకిలీ రిజిస్ట్రేషన్లతో వేధిస్తున్న భూ సమస్యలకు చెక్ పెట్టేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక కీలక ముందడుగు వేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయం నుంచి వర్చువల్ విధానంలో ‘మీ భూమి-బ్లాక్ చెయిన్’ పైలట్ ప్రాజెక్టును ఆయన అధికారికంగా ప్రారంభించారు. రెవెన్యూ వ్యవస్థలో పారదర్శకత పెంచడమే కాకుండా, రైతుల భూములకు శాశ్వత రక్షణ కల్పించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం.
భూ రికార్డులకు తిరుగులేని భద్రత
ఈ నూతన వ్యవస్థ ద్వారా ప్రతి ల్యాండ్ పార్సెల్‌కు ఒక ప్రత్యేకమైన డిజిటల్ ఐడీని కేటాయిస్తారు. హైపర్ లెడ్జర్ ఫ్యాబ్రిక్ సాంకేతికత ఆధారంగా NIC ఆంధ్రప్రదేశ్ , NIC బెంగళూరు సంస్థలు సంయుక్తంగా దీనిని అభివృద్ధి చేశాయి. బ్లాక్ చెయిన్ టెక్నాలజీ వల్ల భూమి రికార్డులను ఎవరూ మార్చేందుకు లేదా ట్యాంపరింగ్ చేసేందుకు వీలుండదు. అలాగే ఒకే భూమిని ఇద్దరికి అమ్మే ‘డబుల్ రిజిస్ట్రేషన్’ సమస్యలకు ఇది శాశ్వతంగా ముగింపు పలుకుతుంది.
మూడు శాఖలు.. ఒకే వేదిక
ఇప్పటివరకు వేర్వేరుగా పనిచేస్తున్న రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖలను ఈ ప్రాజెక్ట్ ద్వారా ఒకే వేదికపైకి తీసుకువస్తున్నారు. దీనివల్ల భూ లావాదేవీలు వేగంగా, పారదర్శకంగా జరుగుతాయి. ప్రస్తుతం కర్నూలు, చిత్తూరు, బాపట్ల , కృష్ణా , తూర్పు గోదావరి , పార్వతీపురం మన్యం , విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లోని 89 రీ-సర్వే గ్రామాలలో, దాదాపు 1,37,763 ల్యాండ్ పార్సెళ్లతో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు చేస్తున్నారు.
నవంబర్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమలు
గత ప్రభుత్వంలో భూ వివాదాలు, 22ఏ పేరుతో జరిగిన అక్రమాల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఇకపై సర్వే పూర్తయిన ప్రతి గ్రామాన్ని వెంటనే బ్లాక్ చెయిన్ పరిధిలోకి తీసుకువస్తామని స్పష్టం చేశారు. రాబోయే రెండు నెలల పాటు ఈ పైలట్ ప్రాజెక్టు తీరుతెన్నులను క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ప్రజల నుంచి వస్తున్న అభిప్రాయాలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక కంప్లైంట్ సెల్ ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అన్ని సరిదిద్ది నవంబర్ నాటికి ఈ టెక్నాలజీని రాష్ట్రవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఈ కార్యక్రమంలో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్, సీఎస్ సాయిప్రసాద్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.








