AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

‘ఇళ్లు కట్టకపోతే నేను పోటీ చేయను.. మరి కేటీఆర్ సిద్ధమేనా’..? మంత్రి పొంగులేటి సవాల్..!

హైదరాబాద్ నగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో నిర్మించిన ఇళ్ల కంటే వచ్చే రెండున్నర సంవత్సరాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మించకపోతే తాను వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోనని, ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయకుండా ఉంటారా? అని మంత్రి శ్రీనివాసరెడ్డి సవాల్ విసిరారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సహచర మంత్రులు పొన్నం ప్రభాకర్, మహ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యే నాయకుడు రాజేందర్‌తో కలిసి మంత్రి పొంగులేటి మాట్లాడారు.

 

మంత్రి శ్రీనివాసరెడ్డి సవాల్..

 

‘రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన గ్రామాల్లోనే మేము ఓట్లు అడుగుతాం.. మీరు ఇళ్లు కట్టిన ప్రాంతాల్లో ఓట్లు అడగడానికి సిద్ధమా?’ అని ప్రశ్నించారు. ఇళ్ల పేరిట డ్రామాలు చేసే నాయకులు అసంబద్ధ వ్యాఖ్యలు చేస్తున్నారని తీవ్రంగా విమర్శించారు. ఓఆర్‌ఆర్ ఇన్నర్ పరిధిలోని క్యూర్ ఏరియాలో తొలి విడతగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి త్వరలో ముఖ్యమంత్రి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మళ్లీ విడతలో కూడా పట్టణ ప్రాంతాలకు మరో లక్ష ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. ప్రతి నియోజకవర్గాన్ని ఒక యూనిట్‌గా తీసుకొని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నామని, దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని తెలిపారు.

 

స్థలాల పరిశీలన ప్రారంభం

 

ముఖ్యమంత్రి సూచనల మేరకు పూర్తి స్థాయి విధివిధానాలు రూపొందిస్తున్నామని వెల్లడించారు. ఇప్పటికే క్యూర్ పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాల్లో స్థలాల పరిశీలన ప్రారంభించామని, కేవలం 12 రోజుల వ్యవధిలోనే 39 నుంచి 40 స్థలాలను గుర్తించామని తెలిపారు. వెయ్యి గజాల నుంచి 25 ఎకరాల వరకు ఉన్న ప్రభుత్వ భూముల్లో నిరుపేదల ఆత్మగౌరవానికి చిహ్నాలైన ఇందిరమ్మ ఇళ్లను నిర్మిస్తామని పేర్కొన్నారు.

 

మంత్రి స్పష్టం

 

ఈ ఇళ్లను ఆడబిడ్డల పేరిట ప్రభుత్వం స్వయంగా రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తుందని, లబ్ధిదారులపై ఒక్క పైసా భారం కూడా ఉండదని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి ఆదాయం అవసరమైనా సరే… కోట్ల రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను పేదల గృహ నిర్మాణం కోసం వినియోగిస్తామని తెలిపారు. తమ ప్రజా ప్రభుత్వం తొలి విడతగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇళ్లు, గిరిజన ప్రాంతాలకు 5 వేల వరకు ఇళ్లు మంజూరు చేసిందని, ఇప్పుడు రెండో విడతగా మరో 2 వేల ఇళ్లు మంజూరు చేయడంతో ఒక్కో నియోజకవర్గానికి 5,500 నుంచి 7 వేల ఇళ్ల వరకు అందించినట్లయిందన్నారు. పట్టణ పేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలనే సంకల్పంతో అధికారులు కూడా అహర్నిశలు శ్రమిస్తున్నారని మంత్రి కొనియాడారు.

 

పేదలకు తీవ్ర అన్యాయం చేసిన బీఆర్ఎస్

 

గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఊరికో ఐదు, పది ఇళ్లు కూడా సమర్థంగా నిర్మించలేదని, కొందరు కోటరీ నాయకులు సూచించిన ప్రాంతాల్లో ఇళ్లు నిర్మించి పేదలకు తీవ్ర అన్యాయం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వం సుమారు 45 నుంచి 46 వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి, అందులో 20 వేలకుపైగా ఇళ్లను అసంపూర్తిగా వదిలేసిందని తెలిపారు. నిర్మించిన ఇళ్లలో కూడా సుమారు 16 వేల పైచిలుకు ఇళ్లలో లబ్ధిదారులు నివసించలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొన్నారు. అనేక కాలనీల్లో కనీస మౌలిక వసతులు కూడా లేవని, కొల్లూరు ప్రాంతంలో ఇళ్లు కారిపోతున్నాయని అన్నారు. ఆ సమస్యలను ఇప్పుడు తమ ప్రభుత్వం పరిష్కరిస్తోందని చెప్పారు. రవాణా, రేషన్ తదితర సౌకర్యాలను కల్పిస్తామని వెల్లడించారు.

 

పాత ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మాణం

 

అంతేకాకుండా నిరుపయోగంగా ఉన్న షాపులను బహిరంగ వేలంలో విక్రయించి, వచ్చిన నిధులను ఆయా భవనాల నిర్వహణ కమిటీల ఖాతాల్లోనే జమ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. దీనికి సంబంధించిన విధానపరమైన నిర్ణయాలు త్వరలో అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఉమ్మడి రాష్ట్రంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో 40 సంవత్సరాల క్రితం జి ప్లస్ టూ విధానంలో నిర్మించిన ఇళ్లు ప్రస్తుతం శిథిలావస్థకు చేరాయని, అప్పట్లో జిల్లా కలెక్టర్లు నివేదికలు ఇచ్చినా గత ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఇప్పుడు తమ ప్రభుత్వం ఆ పాత ఇళ్ల స్థానంలో కొత్త ఇళ్లు నిర్మించి పేదలకు గౌరవప్రదమైన జీవనం అందిస్తుందని మంత్రి పేర్కొన్నారు.

 

నగరంలో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన..

 

హైదరాబాద్ జిల్లా పరిధిలోని ఆసిఫ్‌నగర్ మండలం జియాగూడ పోలీస్ క్వార్టర్స్, మంగార్ బస్తీ బాంబే కాలనీ, నాంపల్లి రెడ్ హిల్స్ ఖాళీ స్థలాలు, శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్, మలక్‌పేట్, కాలడేరా ఆర్ బి కాలనీ, గోల్కొండ మండలం ఫలక్‌నుమాలోని 2 బీహెచ్ కే భవనాలు, డిగ్నిటీ కాలనీ ప్రాంతాల్లోని ఖాళీ స్థలాలను హైదరాబాద్ పార్లమెంట్ సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజహరుద్దీన్, ఎమ్మెల్యేలు మాజిద్ హుస్సేన్, అహ్మద్ బిన్ అబ్దుల్లా బలాల తదితర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పొంగులేటి విస్తృతంగా పరిశీలించారు. శిథిలావస్థలో ఉన్న భవనాలు, ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూములను వేగవంతంగా మ్యాపింగ్ చేసి గృహ నిర్మాణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. శిథిలావస్థ భవనాల్లో నివసిస్తున్న కుటుంబాలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు.

ANN TOP 10