హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఫిరోజ్‌ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ ఒకరినొకరు కొట్టుకున్నారు. హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ నేతల సమావేశం సందర్భంగా ఈ రసాభాస జరిగింది. మంత్రులు అజహరుద్దీన్, పొన్నం ప్రభాకర్ కళ్ల ముందే చొక్కాలు పట్టుకొని ఫిరోజ్, ఉస్మాన్ ఘర్షణకు దిగారు. అజారుద్దీన్ పక్కన కూర్చునే అంశంలో ఈ వివాదం చెలరేగింది.
తొలుత ఉస్మాన్ అల్ హజ్రీ తోసేయడంతో ఫిరోజ్‌ఖాన్ ఒక్కసారిగా కిందపడ్డారు. సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావును సైతం తోసేందుకు యత్నించినట్లు తెలుస్తోంది. దీంతో అక్కడి నేతలు అడ్డుకొని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తీవ్ర ఘర్షణ నేపథ్యంలో మంత్రి అజహరుద్దీన్ కోపంతో అక్కడి నుంచి వెళ్లిపోయారని సమాచారం. దీంతో సమావేశాన్ని రద్దు చేస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.
మరోవైపు గొడవపై ఫిరోజ్ ఖాన్ స్పందించారు. కుర్చీలో కూర్చోవడం విషయంలో ఇబ్బంది జరిగిందని అంగీకరించారు. చిన్న మిస్ అండర్ స్టాండింగ్ వల్ల గొడవ అయ్యిందన్న ఫిరోజ్ ఖాన్.. ఉస్మాన్ తన పెద్దన్న లాంటి వారని పేర్కొన్నారు. ఉస్మాన్ వేదికపైకి రమ్మంటే తాను వెళ్లలేదని అన్నారు. అయితే ఉస్మాన్ తనకు ముద్దు కూడా పెట్టారని ఫిరోజ్ వ్యాఖ్యానించారు. జరిగినదంతా తమ ఫ్యామిలీ విషయమని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు.
అటు ఫిరోజ్ ఖాన్ తో గొడవ గురించి ఉస్మాన్ అల్ హజ్రీ సైతం రియాక్ట్ అయ్యారు. ఫిరోజ్ కు తాను క్షమాపణలు చెప్పినట్లు తెలిపారు. ఇద్దరు అన్నదమ్ముల మధ్య జరిగిన చిన్న గొడవ అని ఉస్మాన్ పేర్కొన్నారు. తమది కాంగ్రెస్ ఫ్యామిలీ అన్న ఉస్మాన్.. ఫ్యామిలీ అన్నాక చిన్న గొడవలు జరుగుతూ ఉంటాయని చెప్పారు. తాను తోసింది మాత్రమే చూశారని.. అంతకుముందు ఏం జరిగిందో కూడా తెలుసుకోవాలని ఉస్మాన్ సూచించారు.
అటు మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ నాయకుల మధ్య చోటుచేసుకున్నది కేవలం చిన్న అపార్థమేనని తేల్చిచెప్పారు. బయట ప్రచారం జరుగుతున్నట్లుగా ఎలాంటి పెద్ద సంఘటన జరగలేదని అన్నారు. పార్టీ అంతర్గత విషయాలను వక్రీకరించి ప్రచారం చేయడం సరైంది కాదని మంత్రి అభిప్రాయపడ్డారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఇద్దరూ కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న నాయకులు అని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ప్రజల సమస్యలపై పోరాడే పార్టీ అన్న మంత్రి.. అనవసరంగా ఈ అంశంపై రాద్ధాంతం చేయడం మానుకోవాలని సూచించారు. సమావేశం జరిగిన కొద్ది నిమిషాల్లోనే ఇద్దరు నేతలు పరస్పరం మాట్లాడుకొని కౌగిలించుకుని కలిసిపోయారన్నారు.








