తెలంగాణను పదేళ్లు పాలించిన బీఆర్ఎస్, అధికార కాంగ్రెస్ పార్టీ.. ఎంఐఎం (మజ్లిస్) పార్టీ కనుసన్నల్లో నడుస్తూ హైదరాబాద్ నగర ప్రజలను తీవ్రంగా మోసం చేస్తున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు మండిపడ్డారు. ఈ 3 పార్టీలు నగరాన్ని పంచుకు తింటున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కూకట్‌పల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నగరంలోని ప్రధాన సమస్యలను ప్రస్తావిస్తూ అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్ పార్టీల తీరును ఎండగట్టారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల పేరుతో గరీబోళ్లను నిలువునా ముంచితే, నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ‘ఇందిరమ్మ ఇళ్లు’ అంటూ అదే తరహాలో ప్రజలను నమ్మించి వంచిస్తోందని అన్నారు.
గత ప్రభుత్వం కట్టిన కొన్ని అరకొర ఇళ్లనే ఇప్పుడు చూపించుకుంటూ కాంగ్రెస్ సర్కార్ కాలక్షేపం చేస్తోందని అన్నారు. నివేదికల పేరుతో కాలయాపన చేస్తూ రెండు పార్టీలు కూడా హైదరాబాద్ నగరంలోని పేద ప్రజలకు తీవ్ర అన్యాయం చేశాయని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని విభజించి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తీసుకురావాలనే ఆలోచన కేవలం మజ్లిస్ పార్టీ ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. మూడు భాగాలుగా విడగొడితే తప్ప మజ్లిస్ గెలవలేని పరిస్థితి ఉందని, అందుకే వారికి జీహెచ్ఎంసీని అశాస్త్రీయంగా మూడు భాగాలుగా విభజించారని అన్నారు. అందులో ఒక భాగాన్ని ధారాదత్తం చేయడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధమైందని విమర్శించారు.
మరోవైపు నగరంలో తాగునీటి సరఫరా వ్యవస్థ పూర్తిగా పడకేసిందని రాంచందర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇప్పటివరకు నీటి ఎద్దడిని నివారించలేకపోయిందన్నారు. మూడు, నాలుగు రోజులకు ఒకసారి కూడా నీళ్లు రాక ప్రజలు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారని, జలమండలి తీవ్రంగా వైఫల్యం చెందిందని విమర్శించారు. మరోవైపు వర్షం వస్తే బస్తీలన్నీ మునిగిపోయే పరిస్థితి ఉందని అన్నారు. నగరంలో రోడ్ల పరిస్థితి దారుణంగా ఉన్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. హిల్ట్ పాలసీ పేరుతో కాలుష్య కారక పరిశ్రమలను నగరం వెలుపలికి తరలించాలనే నెపంతో లోపల ఉన్న పారిశ్రామిక ప్రాంతాలను రెసిడెన్షియల్ జోన్లుగా మార్చి భారీ రియల్ ఎస్టేట్ కుంభకోణానికి తెరలేపారని ఆరోపించారు.
హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా, విశ్వనగరంగా మార్చడం కేవలం భారతీయ జనతా పార్టీ తోనే సాధ్యమవుతుందని రాంచందర్ రావు నొక్కి చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో నగరాల అభివృద్ధికి ఎన్నో పథకాలు ఉన్నాయన్నారు. ‘స్మార్ట్ సిటీ’, ‘అమృత్ సిటీ’ వంటి స్కీమ్స్ నిధులతో తెలంగాణను కేంద్రం అభివృద్ధి చేస్తోందని తెలిపారు. అదేవిధంగా ఇక్కడ పర్యాటక రంగాన్ని అద్భుతంగా అభివృద్ధి చేస్తామని ప్రజలకు వాగ్దానం చేశారు. తమ స్వప్రయోజనాల కోసం హైదరాబాద్ ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న మజ్లిస్, బీఆర్ఎస్, కాంగ్రెస్ అనే ఈ మూడు స్వార్థ పార్టీలకు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో నగర ప్రజలు బుద్ధి చెప్పాలని బీజేపీ రాష్ట్ర చీఫ్ పిలుపునిచ్చారు








