కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కనిపించిన సర్కరు భూములన్నింటినీ ఖతం పెడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. శంషాబాద్ మండలం పెద్దషాపూర్ ప్రాంతంలో భారీ భూ కుంభకోణం జరిగిందన్నారు. ఈ వ్యవహారం వెనుక ప్రభుత్వ పెద్దల పాత్ర ఉందన్నారు. దాదాపు రూ. 1000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగిందన్నారు.
నాలుగు రోజుల్లో నివేదికలు ఎలా మారాయి?
శంషాబాద్ మండలం పెద్దషాపూర్ పరిధిలో సర్వే నంబర్లు 173 నుంచి 183 మధ్య ఉన్న సుమారు 180 ఎకరాల ప్రభుత్వ భూ మాయ జరిగిందని హరీష్ ఆరోపించారు. ఈ భూమి ప్రభుత్వానికి చెందిందని ఆర్డీవో ఫిబ్రవరి 24న హైకోర్టుకు నివేదిక ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రభుత్వ భూమిని రక్షించాలని, దానిని నిషేధిత భూముల జాబితాలో చేర్చాలని కూడా ఆ నివేదికలో సూచించినట్లు చెప్పారు. అయితే, కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే అదే భూమిపై ఎమ్మార్వో పూర్తి భిన్నమైన నివేదిక ఇచ్చారని హరీశ్ రావు ఆరోపించారు. ఫిబ్రవరి 28న ఎమ్మార్వో ఇదే భూమి ప్రైవేట్ వ్యక్తులకు చెందుతుందని పేర్కొంటూ ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. ఒక ప్రభుత్వ అధికారి ప్రభుత్వ భూమి అంటుంటే, మరో అధికారి ప్రైవేట్ భూమి అనడం ఏంటని ప్రశ్నించారు.
సదరు 180 ఎకరాల భూమి విలువ సుమారు రూ. 1000 కోట్ల వరకు ఉంటుందని, అందుకే దీనిపై పెద్ద ఎత్తున ఒత్తిళ్లు జరిగాయని హరీశ్ రావు ఆరోపించారు. సీఎం కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకునే ఓ కార్పొరేషన్ అధికారికి ఈ వ్యవహారంతో సంబంధం ఉందని ఆరోపించారు. సీఎంకు కళ్లు, చెవులు ఆయనే అని చెబుతుంటారు హరీశ్ పరోక్షంగా సదరు వ్యక్తిని ప్రస్తావించారు.
ఎమ్మార్వోపై ఏసీబీ దాడిని అడ్డుకున్నారని ఆరోపణ
ఈ భూ కుంభకోణానికి సంబంధించిన కేసులో ఎమ్మార్వోపై ఏసీబీ దాడి జరగాల్సి ఉండగా, కార్యాలయంలో పూర్తి స్థాయిలో తనిఖీలు చేయకుండానే అధికారులు వెనుదిరిగారని హరీశ్ రావు చెప్పుకొచ్చారు. దీని వెనుక కూడా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయని ఆరోపించారు. ఎమ్మార్వోను సస్పెండ్ చేయకుండా కేవలం బదిలీ చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు.
సిట్ విచారణకు హరీష్ డిమాండ్
ప్రభుత్వానికి నిజంగా ఈ భూ కుంభకోణంతో సంబంధం లేకపోతే వెంటనే ఎమ్మార్వో ఉత్తర్వులను రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. అలాగే ఆ భూములను నిషేధిత జాబితాలో చేర్చి, మొత్తం భూ వ్యవహారంపై సిట్ ద్వారా సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. ఈ భూ కుంభకోణంలో ఎవరి పాత్ర ఉన్నా బయటకు తీసుకురావాలని హరీశ్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








