బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ లోని ప్రతీ ఇంటికి 24 గంటల పాటు తాగునీటిని సరఫరా చేస్తామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ ఏర్పాటుకు ముంద కాంగ్రెస్ పాలనలో కరెంటు కోతలు, నీటి కొరతలు ఎక్కువగా ఉండేవని ఆరోపించారు. గత బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్ కు 24 గంటల నిరంతర కరెంటు అందించామని ధీమా వ్యక్తం చేశారు. అదే విధంగా తిరిగి అధికారంలోకి వస్తే.. ఈసారి ప్రతీ ఇంటికి తాగునీరు 24 గంటలపాటు అందిస్తామని హామీ ఇచ్చారు. ఆ బాధ్యతను స్వయంగా తాను తీసుకుంటానని అన్నారు.
‘హైదరాబాద్‌కు చేసిందేమి లేదు’
సోమవారం కూకట్ పల్లిలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశంలో స్పెషల్ ఇంటెన్సీ రివిజన్ (SIR) ఓట్ల సవరణ కార్యక్రమంపై కేటీఆర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి పైప్ లైన్ తో మిషన్ భగీరథ ద్వారా మంచినీరు అందించామని అన్నారు. ఎన్నికల ప్రచారంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి.. ప్రతీ వర్గాన్ని కాంగ్రెస్ మోసం చేసిందని ఆరోపించారు. పెన్షన్ల నుంచి మొదలుకొని మహిళలకు రూ.2,500 వరకు ప్రతి ఒక్క వర్గానికి హామీలు ఇచ్చి మోసం చేసిందన్నారు. హైదరాబాద్ కు గత రెండున్నరేళ్లలో కాంగెస్ చేసిందేమి లేదని విమర్శించారు. ఒక్కటంటే ఒక్క రూపాయి కూడా అదనంగా హైదరాబాద్ కు ఖర్చు చేయలేని అసమర్థ ప్రభుత్వం కాంగ్రెస్ అని దుయ్యబట్టారు.
‘రాజకీయ సన్యాసం చేస్తా’
బీఆర్ఎస్ హయాంలో అనేక ఫ్లైఓవర్ల నుంచి టిమ్స్ ఆసుపత్రుల దాకా ప్రతి ఒక్కటి తామే నిర్మించామని కేటీఆర్ అన్నారు. వాటి రిబ్బన్ కట్ చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని విమర్శించారు. రెండున్నర సంవత్సరాలలో హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా నిర్మించలేదని అన్నారు. ఒకవేళ హైదరాబాద్ నగరంలో ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించినట్లు నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తానని సవాలు విసిరారు. కాంగ్రెస్ పార్టీ పాలన గురించి అవగాహన ఉన్న కారణంతోనే హైదరాబాద్ నగర ప్రజలు.. ఒక్క సీటు ఇవ్వలేదని కేటీఆర్ గుర్తుచేశారు.
భవన నిర్మాణ కార్మికులకు భరోసా
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా కాంగ్రెస్ వల్లే దెబ్బతిందని కేటీఆర్ ఆరోపించారు. దీంతో లక్షలాది మంది భవన నిర్మాణ కార్మికులకు, సెంట్రింగ్ కార్మికులకు ఉపాధి లభించకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భవన నిర్మాణ కార్మికులతో పాటు సెంట్రింగ్ కార్మికుల కోసం బీమాతో పాటు ఇతర సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని హామీ ఇచ్చారు. గత పదేళ్ల పాలనలో అభివృద్ధిపై పూర్తిగా ఫోకస్ చేశామన్న కేటీఆర్.. ఈసారి అధికారంలోకి వచ్చాక కార్యకర్తలు, నేతలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు.
డిజిటల్‌గా సభ్యత్వ నమోదు
మరోవైపు ఈ దఫా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం డిజిటల్ రూపంలో నిర్వహించబోతున్నట్లు కేటీఆర్ తెలిపారు. సభ్యత్వ నమోదుకు సంబంధించిన.. కార్యక్రమం, కమిటీల ఏర్పాటు దాదాపు 50 నుంచి 60 రోజుల పాటు కొనసాగుతుందని కేటీఆర్ అన్నారు. సభ్యత్వ నమోదుకు సంబంధించి కూడా పార్టీ కార్యకర్తలకు పార్టీ తరఫున ప్రత్యేక శిక్షణ ఇస్తామని తెలిపారు. మరోవైపు SIR ప్రక్రియ పట్ల పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండాలని కేటీఆర్ సూచించారు. కాంగ్రెస్, బీజేపీ నమోదు చేసిన దొంగ ఓట్ల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. దీంతోపాటు బీఆర్ఎస్ సానుభూతిపరుల ఏ ఒక్కరి ఓటు కూడా పోకుండా పార్టీ శ్రేణులు ప్రజలకు అండగా ఉండాలని కోరారు. దీనికోసం ప్రతి బూత్ నుంచి తగిన ప్రణాళికతో ముందుకు పోవాలని దిశానిర్దేశం చేశారు.







