AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఆడబిడ్డల కోసం రేవంత్ రెడ్డి మైండ్ బ్లోయింగ్ ప్లాన్.. !

మహిళలను ఆర్థికంగా నిలబెట్టే అద్భుతమైన ప్రణాళికతో ప్రజా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఇందులో భాగంగానే ఒకేసారి 8,000 మహిళా సంఘాల భవనాలకు శంకుస్థాపన చేయడం దేశంలోనే ఒక సంచలన నిర్ణయమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ఆడబిడ్డల ఆశీర్వాదంతోనే ఈ ప్రభుత్వం ఏర్పడిందని, మహిళల అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం ఆర్థికంగా నిలబడుతుందని సీఎం స్పష్టం చేశారు.

 

అడ్డంకులు దాటి ఉచిత బస్సు ప్రయాణం

 

ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించామని, ఇందుకోసం ఇప్పటివరకు ఆర్టీసీకి రూ.10,000 కోట్లు చెల్లించామని ముఖ్యమంత్రి వివరించారు. ఈ పథకాన్ని రద్దు చేయించాలని, ఆటో కార్మికులను రెచ్చగొట్టి కుట్రలు చేయాలని కొందరు చూశారని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆడబిడ్డల సంక్షేమం కోసం ఉచిత ప్రయాణాన్ని కొనసాగిస్తామని రేవంత్ రెడ్డి తేల్చిచెప్పారు. మహిళలను బస్సులకు యజమానులను చేసేలా 1,000 బస్సులు కొనుగోలు చేసి ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా చర్యలు తీసుకున్నామని, జూన్ 5న పరేడ్ గ్రౌండ్‌లో 553 బస్సులను ప్రారంభించబోతున్నామని వెల్లడించారు.

 

కార్పొరేట్ సంస్థలకు దీటుగా మహిళా శక్తి

 

సోలార్ ఎనర్జీ అంటే అదానీ, అంబానీలే కాకుండా, మన మహిళా సంఘాలు కూడా 1000 మెగావాట్ల సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. రిలయన్స్ లాంటి సంస్థలు చేసే పెట్రోల్ బంక్ వ్యాపారాలను, అలాగే రైస్ మిల్లులు, గోడౌన్లు, ప్లాస్టిక్ పార్కుల నిర్వహణను కూడా మహిళా సంఘాలకే అప్పగిస్తామని ప్రకటించారు. ఇందుకోసం 100 ఎకరాల వరకు ప్రభుత్వ భూములను కేటాయించి, సున్నా వడ్డీతో బ్యాంక్ లింకేజీ రుణాలను అందిస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. బ్యాంక్ లింకేజీ లోన్లను రూ.5 లక్షల నుండి రూ.10 లక్షలకు పెంచామని, ఇప్పటికే రూ.60,000 కోట్ల రుణాలు అందించామని చెప్పారు. సున్నా వడ్డీ రుణాల కోసం ప్రభుత్వం రూ.1390 కోట్లు విడుదల చేసిందన్నారు.

 

‘ఇందిరమ్మ చీరలు’.. కోటీశ్వరులను చేసే లక్ష్యం

 

డీమార్ట్, బిగ్ బజార్ కంటే అద్భుతంగా ఉండేలా ‘మహిళా శక్తి సూపర్ బజార్లు’ ఏర్పాటు చేస్తామని, అందులో ప్రభుత్వం కూడా భాగస్వామిగా ఉంటుందని సీఎం తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన చీరలు పంట పొలాల్లో పిట్టలను కొట్టడానికి పనికొచ్చాయని, కానీ ఇప్పుడు నాణ్యమైన చిలుక పచ్చ రంగు ‘ఇందిరమ్మ చీరల’ కొత్త డిజైన్లను విడుదల చేశామని చెప్పారు. సొంత చెల్లెలిని ఆస్తి కోసం బయటకు వెళ్లగొట్టే నాయకులను చూస్తున్నామని, కానీ ఈ ప్రభుత్వం రాష్ట్రంలోని కోటి మంది ఆడబిడ్డలను సొంత సోదరీమణులుగా భావిస్తోందని రేవంత్ రెడ్డి అన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు

ANN TOP 10