తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతున్న కాషాయ పార్టీ ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై పోరుబాటకు సిద్ధమవుతోంది. తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు ప్రణాళికలు రచించుకుంది. మొన్నటి ప్రధాని మోడీ సభ ఇచ్చిన జోష్‌ను అలాగే కంటిన్యూ చేసేందుకు బీజేపీ సరికొత్త స్కెచ్ వేసింది. తెలంగాణ బీజేపీ ప్రజాప్రతినిధులతో పార్టీ చీఫ్ రాంచందర్ రావు నేతృత్వంలో కీలక సమావేశం జరిగింది.
గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా..
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం, ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై క్షేత్రస్థాయి పోరాటాలకు ఈ భేటీలో కార్యాచరణ సిద్ధం చేశారు. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా ముందుకు వేస్తున్న బీజేపీకి ఇటీవల ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన పార్టీ కేడర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆ జోష్‌ను ఏమాత్రం తగ్గకుండా.. గ్రౌండ్ లెవల్‌కు తీసుకెళ్లేలా బీజేపీ రాష్ట్ర నాయకత్వం సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. బీజేపీ చీఫ్ రాంచందర్ రావు అధ్యక్షతన జరిగిన ప్రజాప్రతినిధుల సమావేశంలో దీనిపైనే సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ ప్రజాప్రతినిధులకు పలు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు.
సంక్షోభంపై ఫోకస్..
ప్రధానంగా రైతు, కార్మిక సమస్యలపై బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటం చేయాలని ఈ సమావేశంలో బీజేపీ నేతలు తీర్మానించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న ధాన్యం కొనుగోలు సంక్షోభంపై ఫోకస్ పెట్టారు. రైతులు ఐకేపీ సెంటర్లలో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు.. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలంతా క్షేత్రస్థాయిలో ఐకేపీ సెంటర్లను సందర్శించాలని నిర్ణయించారు. సోమవారం నుంచి మూడు రోజుల పాటు వడ్ల కొనుగోలు కేంద్రాలను బీజేపీ ఎంపీ, ఎమ్మెల్యేలు విజిట్ చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలను, హామీలను తుంగలో తొక్కి ప్రజలను ఘోరంగా మోసం చేసిందని బీజేపీ నేతలు మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేలా, ఎల్లప్పుడూ క్షేత్రస్థాయిలోనే ఉంటూ ప్రజల పక్షాన నిలబడాలని సమావేశంలో తీర్మానించారు.
దళారుల వల్ల రైతులు
ధాన్యం కొంటరా.. గద్దె దిగుతరా? అనే నినాదంతో బీజేపీ పోరుబాటకు సిద్ధమవుతోంది. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాల వద్ద ఆందోళనకు బీజేపీ సిద్ధమవుతోంది. కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాచి రైతులు మరణించిన ఘటనలు ఇటీవల పెరగడంతో ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతగా బీజేపీ తీసుకుంది. ఈ అంశంపై పోరును ఉధృతం చేసి రాష్ట్ర సర్కార్ కు కళ్లెం వేయాలని చూస్తోంది. అంతేకాకుండా దళారుల వల్ల రైతులు పడుతున్న ఇబ్బందులను సైతం లేవనెత్తాలని నిర్ణయించింది. అలాగే సంచులు కూడా రైతులే కొనుక్కోవాల్సి వస్తుండటం, తేమ కారణంగా క్వింటాకు రూ.2000 వరకు నష్టపోతున్నారని బీజేపీ ఆరోపిస్తోంది.
కనీస జీవన భద్రత
లారీలు, హమాలీలు సకాలంలో అందక పంట రోడ్డుపైనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని, రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలులో విఫలమైందని కాషాయ పార్టీ విమర్శిస్తోంది. ఇకపోతే కనీస వేతనాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికులను మభ్యపెడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. 12 సంవత్సరాల తర్వాత కనీస వేతనాలు పెంచామని కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోందని, కానీ పెరిగిన ధరలు, అద్దెలు, కరెంట్ బిల్లులు, నిత్యావసర ఖర్చులు చూస్తే ఈ పెంపు ఏమాత్రం సరిపోదని కమలం పార్టీ చెబుతోంది. కార్మికుడి కుటుంబం నెల గడవాలంటే కనీసం రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు అవసరం ఉన్న పరిస్థితి ఉందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కార్మికులకు కనీస జీవన భద్రత కూడా కల్పించలేని స్థాయిలో వేతనాలు ప్రకటించిందని బీజేపీ మండిపడుతోంది.
సమన్వయ లోపం
ఒకవైపు ప్రజా సమస్యలపై పోరాటాన్ని చేపడుతూనే.. మరోవైపు తెలంగాణలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపైనా నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. ముఖ్యంగా ప్రజాప్రతినిధుల మధ్య ఎలాంటి సమన్వయ లోపం ఉండకూడదని, ఎంపీలు, ఎమ్మెల్యేలు నిరంతరం కో-ఆర్డినేషన్ చేసుకోవాలని రాష్ట్ర ఇన్‌చార్జ్ అభయ్ పాటిల్ స్పష్టం చేసినట్లు తెలిసింది. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా వెంటనే స్పందించేలా అలర్ట్‌గా ఉండాలని, ప్రతి ఒక్కరూ ఫీల్డ్ విజిట్స్ చేయాలని తేల్చి చెప్పినట్లు వినికిడి. కాంగ్రెస్ సర్కార్‌పై ప్రజా వ్యతిరేకతను అనుకూలంగా మార్చుకుంటూ.. నిరంతరం ప్రజల్లో ఉండేలా బీజేపీ ప్రజాప్రతినిధులకు ఈ మీటింగ్ ద్వారా రూట్ మ్యాప్ ఖరారు చేశారు.
అధ్యక్షుడు నితిన్ నబీన్..
ఇటీవల ఢిల్లీ వెళ్లొచ్చిన పార్టీ చీఫ్ రాంచందర్ రావు.., అధిష్టానం ఆదేశాలను నేతల ముందుంచినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ విమర్శలను తిప్పికొట్టడంలో వెనకాడొద్దని.. పార్టీలో ఐక్యతగా ముందుకెళ్తేనే గమ్యాన్ని చేరుకుంటామని రాంచందర్ రావు సూచించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వచ్చేనెల మొదటి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ రాష్ట్రానికి రానున్నారని రాంచందర్ రావు ప్రజాప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సమావేశం కోసం అందరూ సిద్ధంగా ఉండాలని సూచించినట్లు టాక్. మొత్తంగా టీబీజేపీ ప్రజాప్రతినిధులు రైతు, కార్మిక సమస్యల ఎజెండాగా చేపడుతున్న పోరుబాటను ఎంతవరకు కంటిన్యూ చేస్తుందనేది వేచిచూడాలి








