AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం..! ఇంటర్ కాలేజీల్లో తొలిసారి మధ్యాహ్న భోజన పథకం..!

తెలంగాణ ప్రభుత్వం మరో చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ కాలేజీల్లో తొలిసారి మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇన్నాళ్లు ప్రభుత్వ పాఠశాలలకే పరిమితం అయిన మధ్యాహ్న భోజన పథకాన్ని.. ఇకపై జూ. కళాశాలల్లోనూ అమలు కానుంది.

 

ఈ కేబినేట్ సమావేశంలో మరో కీలక నిర్ణయం సైతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్నం భోజనంతో పాటు ఉదయం పూట అల్పాహారాన్ని సైతం అందించాలని నిర్ణయించినట్లు సమాచారం. అలాగే విద్యార్థులకు పాలు సైతం పంపిణీ చేసేందుకు కేబినేట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్. రానున్న విద్యా సంవత్సరం నుంచే దీనిని అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం అందించడం ద్వారా ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల గైర్హాజరి తగ్గి.. హాజరు శాతం పెరుగుతుందని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది.

 

మరోవైపు ఈ కేబినేట్ సమావేశంలోనే మరికొన్ని కీలక నిర్ణయాలను ప్రభుత్వం తీసుకుంది. 2027 గోదావరి పుష్కరాల పనులకు రూ.1000 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపింది. తొలివిడతగా రూ.300 కోట్లు మంజూరు చేయాలని నిర్ణయించింది. అలాగే అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్ గ్రూప్ సెంటర్ల ఏర్పాటుకు కరీంనగర్ జిల్లా మానుకొండూరు మండలం వెలిదిలో 4 ఎకారాలు, చొప్పదండి మండలం రుక్మాపూర్ లో 5, గన్నేరువరం మండలంలో 5 ఎకరాల కేటాయింపునకు ఆమోదం తెలిపింది. గంగాధర డిగ్రీ కాలేజీకి 29, కేసముద్రం ఫైర్ స్టేషన్ కు 18 పోస్టులు మంజూరు చేసింది.

 

ఇదిలా ఉంటే విద్యార్థులకు ఉచితంగా భోజనం అందించే కార్యక్రమం.. దేశంలో 1995 ఆగస్టు 15న అధికారికంగా ప్రారంభమైంది. అప్పట్లో దీనిని ‘నేషనల్ ప్రోగ్రామ్ ఆఫ్ న్యూట్రిషనల్ సపోర్ట్ టు ప్రైమరీ ఎడ్యుకేషన్’ (NP-NSPE) అని పిలిచేవారు. ప్రారంభంలో దేశంలోని 2,408 బ్లాకుల్లో ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల పిల్లలకు నెలకు 3 కిలోల చొప్పున బియ్యం లేదా గోధుమలను ఉచితంగా పంపిణీ చేసేవారు.

 

అయితే 2001 నవంబర్ 28న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇస్తూ.. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు తమ పరిధిలోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లోని ప్రతి బిడ్డకు 300 క్యాలరీలు, 8-12 గ్రాముల ప్రొటీన్లు ఉండేలా వండిన మధ్యాహ్నం భోజనాన్ని కనీసం 200 రోజుల పాటు అందించాలని ఆదేశించింది. దీంతో బియ్యానికి బదులుగా పాఠశాలల్లోనే వేడివేడి వండిన భోజనం పెట్టడం తప్పనిసరైంది.

 

2007లో ఈ పథకాన్ని ప్రాథమిక స్థాయి (1 నుండి 5 తరగతులు) నుండి ఉన్నత ప్రాథమిక స్థాయికి (6 నుండి 8 తరగతులు) విస్తరించారు. 2021లో కేంద్ర ప్రభుత్వం ఈ మధ్యాహ్నం భోజన పథకం పేరును ‘పీఎం పోషణ్ శక్తి నిర్మాణ్’గా మార్చింది. దీని కింద ప్రీ ప్రైమరీ పిల్లలను కూడా చేర్చారు. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రభుత్వ ఇంటర్ కళాశాలల్లోనూ అమలు చేయాలని నిర్ణయించడం చారిత్రాత్మక నిర్ణయంగా చెప్పవచ్చు.

 

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఇలా ఉచితంగా మధ్యాహ్న భోజనం అందించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. పేద పిల్లలు ఆకలి వల్ల బడికి రాకుండా ఉండకూడదనే ఉద్దేశంతో దీనిని తీసుకొచ్చారు. మధ్యాహ్నం ఇంటికి వెళ్లి మళ్లీ బడికి రాని పిల్లలను స్కూల్లోనే ఉంచడం కూడా ఈ పథకం ఉద్దేశంగా చెప్పవచ్చు. అలాగే పేదరికం కారణంగా పిల్లల్లో ఉన్న పోషకాహార లోపాన్ని నివారించడం.. కుల, మత భేదాలు లేకుండా పిల్లలందరూ కలిసి కూర్చుని తినడం ద్వారా చిన్నతనం నుంచే సమానత్వ భావనను పెంపొందించడం దీని వెనుక ఉన్న మరో ప్రధాన ఉద్దేశంగా చెప్పవచ్చు.

ANN TOP 10