మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి ఐటెం సాంగ్ విడుదలై సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తోంది. ‘హల్లల్లల్లో’ అంటూ సాగే ఈ పాట పూర్తి వీడియోను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది. గత రెండు రోజులుగా ప్రోమోతోనే అంచనాలు పెంచిన ఈ పాట, ఇప్పుడు ఫుల్ వీడియోతో అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. విడుదలైన కొద్దిసేపటికే ఈ పాట యూట్యూబ్‌తో పాటు ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ట్రెండింగ్‌లోకి దూసుకెళ్లింది.
“హల్లల్లల్లో… బావ చీర చొక్కా చిక్కడిపోవాలో…” అంటూ అనంత్ శ్రీరామ్ అందించిన సాహిత్యం యువతను ఆకట్టుకుంటోంది. గాయని రక్షిత సురేష్ తన గాత్రంతో పాటకు ప్రత్యేకమైన ఫీల్ తీసుకురాగా, జానీ మాస్టర్ కొరియోగ్రఫీ మరోసారి మ్యాజిక్ చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ తనదైన స్టైలిష్ మాస్ స్టెప్పులు, రా అండ్ రస్టిక్ లుక్‌తో అదరగొట్టారు. ముఖ్యంగా రామ్ చరణ్, జాన్వీ కపూర్ మధ్య కెమిస్ట్రీ పాటకు ప్రధాన బలంగా నిలిచింది.
నిన్న రాత్రి భోపాల్‌లో జరిగిన ‘పెద్ది కీ ఆవాజ్’ ఈవెంట్‌లో ఈ పాట ఆడియో వెర్షన్‌ను మాత్రమే విడుదల చేశారు. అప్పటి నుంచి పూర్తి వీడియో కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు ఈ విడుదల ఓ సర్‌ప్రైజ్‌గా మారింది. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, రెండు పాటలతో సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా, ‘హల్లల్లల్లో’ పాట ఆ అంచనాలను మరింత పెంచింది.








