హైదరాబాద్ పోలీసుల అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరింది. దేశంలోనే తొలిసారిగా ఫిర్యాదులను స్వీకరించటానికి ఏఐ కాప్ రైటర్ యాప్ ను సిటీ పోలీస్ అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో భాష ఏదైనా ఫిర్యాదులను త్వరితగతంగా..ఖచ్చితత్వంతో నమోదు చేయవచ్చు. అత్యాధునిక సాంకేతికతను పోలీసింగ్ వ్యవస్థలో జోడిస్తూ తీసుకొచ్చిన ఈ యాప్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో శనివారం ఆవిష్కరించారు.
10కి పైగా బాషలను గుర్తించే ఏఐ కాప్ రైటర్
మినీ భారత్ గా చెప్పే హైదరాబాద్ లో వేర్వేరు రాష్ట్రాలకు చెందిన వారు లక్షల్లో ఉంటున్న విషయం అందరికీ తెలిసిందే. వీరిలో చాలామందికి తెలుగు, ఇంగ్లీష్ భాషలు రావు. ఫలితంగా ఏదైనా సమస్య వచ్చినా.. న్యాయం కోసం పోలీసుల వద్దకు వెళ్లినా ఫిర్యాదులు నమోదు చేయటంలో పలు సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. భాష అర్థంగాక ఎఫ్ఐఆర్ నమోదులో జాప్యం జరుగుతుండటం.. సమాచారం తప్పుగా నమోదవుతుండటం వల్ల బాధితులకు పూర్తి న్యాయం జరగటం లేదు. ఈ సమస్యలను పరిష్కరించటానికి 10కి పైగా భారతీయ బాషలను గుర్తించే ఏఐ కాప్ రైటర్ యాప్ ను నగర పోలీసులు అందుబాటులోకి తీసుకొచ్చారు. బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ సంస్థతోపాటు ఇంటర్న్ పాగ్రో చందూ సహకారంతో దీనిని రూపొందించారు.
కేవలం సెకన్లలో పూర్తి
హిందీ, తమిళం, బెంగాలీ, మరాఠి వంటి పది భాషల్లో మాట్లాడితే ఈ యాప్ వెంటనే దానిని రాతపూర్వక రూపంలోకి మార్చి పోలీసులకు అర్థమయ్యే భాషలోకి అనువదిస్తుంది. గంటల తరబడి పట్టే ఫిర్యాదు ప్రక్రియను కేవలం సెకన్లలో పూర్తి చేస్తుంది. అనువాదకుల కోసం వేచి చూడాల్సిన అవసరం ఇకపై ఉండదు. ఫిర్యాదును రికార్డ్ చేసిన అధికారి, సమయం వంటి వివరాలు ఆటోమేటిక్ గా పీడీఎఫ్ రూపంలో నిక్షిప్తమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం ఉండదు. బాధితుడు, నిందితుడు, సాక్షులు మాట్లాడే మాటలను వేర్వేరుగా గుర్తించి ఈ యాప్ రికార్డ్ చేస్తుంది.
కమిషనర్ సజ్జనార్ మాట్లాడుతూ..
దీని గురించి మాట్లాడిన కమిషనర్ సజ్జనార్ పోలీసింగ్ వ్యవస్థలో అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ దేశంలోనే తొలిసారిగా ఈ ఏఐ ఆధారిత మల్టీ లింగ్వల్ కంప్లయింట్ రికార్డర్ యాప్ ను తీసుకు రావటం గర్వంగా ఉందన్నారు. ఫిర్యాదులు ఇవ్వటానికి వచ్చే వారు తమ మాతృభాషలో మాట్లాడితే ఈ యాప్ వెంటనే అనువదించి అధికారిక రికార్డుగా మారుస్తుందని చెప్పారు. ప్రతీ అయిదు సెకన్లకు ఒకసారి సమాచారం అప్ డేట్ అవుతుందని తెలిపారు. ఈ సాంకేతికత వల్ల ముఖ్యంగా వలస కార్మికులు, మహిళలు, వృద్ధులకు పోలీసు సేవలపై భరోసా పెరుగుతుందన్నారు. బాధితులు చెప్పే ప్రతి మాటను యథాతథంగా నమోదు చేయడం వల్ల దర్యాప్తులో నాణ్యత పెరుగుతుందని చెప్పారు. తద్వారా నిందితులకు శిక్ష పడే అవకాశాలు మెరుగుపడతాయన్నారు.
ప్రముఖ ప్రతినిధులు
ఈ యాప్ వల్ల పోలీసు అధికారులకు టైపింగ్ భారం తగ్గడమే కాకుండా, రికార్డుల నిర్వహణ సులభతరం అవుతుందని వివరించారు. న్యాయం పొందడానికి భాష అడ్డంకిగా మారొద్దన్న లక్ష్యంతో ప్రవేశపెట్టిన ఈ ఏఐ కాప్ రైటర్ ఆధునిక పోలీసింగ్‌లో సరికొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. సాంకేతికతను అందిపుచ్చుకుని ‘స్మార్ట్ పోలీసింగ్’ ద్వారా ప్రజలకు మరింత మెరుగైన, వేగవంతమైన సేవలు అందించడమే హైదరాబాద్ సిటీ పోలీస్ లక్ష్యమని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు సీపీ(క్రైమ్స్ అండ్ సిట్) ఎం.శ్రీనివాసులు, అదనపు సీపీ(లా అండ్ ఆర్డర్) తఫ్సీర్ ఇక్బాల్, డీసీపీ సీహెచ్ రూపేష్, ఐటీ సెల్ సీఐ రమేశ్, బ్లూ క్లౌడ్ సాఫ్ట్ టెక్ సొల్యూషన్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.








