భారత్‌లో వ్యంగ్యంగా పుట్టిన ‘బొద్దింకల ఉద్యమం’ ఇప్పుడు సరిహద్దులు దాటి పొరుగు దేశమైన పాకిస్తాన్‌కు పాకింది. అక్కడి సోషల్ మీడియా వేదికలను ప్రస్తుతం ఈ ‘బొద్దింకల పార్టీలు’ ముంచెత్తుతున్నాయి. పాక్ లోని ప్రధాన రాజకీయ పార్టీలను టార్గెట్ చేస్తూ అక్కడి జెన్-Z యువత పెద్ద ఎత్తున కాక్రోచ్ మూవ్ మెంట్ ను లేవనెత్తుతున్నారు. అక్కడి పార్టీలను ప్రతిబింబించేలా కాక్రోచ్ పార్టీల పేర్లు పెట్టి.. నెట్టింట రచ్చ రచ్చ చేస్తున్నారు.
భారత్‌లో పుట్టిన ‘సీజేపీ’ (CJP)
వాస్తవానికి ఈ విచిత్రమైన సోషల్ మీడియా ట్రెండ్‌కు భారత్‌లోనే బీజం పడింది. ఈనెల 16న ఇంటర్నెట్ వేదికగా ‘కాక్‌రోచ్ జనతా పార్టీ’ (CJP) పేరుతో సోషల్ మీడియా అకౌంట్‌ను ప్రారంభించారు. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్.. ఆన్ లైన్ యాక్టివిజం వైపు మళ్లుతున్న యువతను ఉద్దేశించి బొద్దింకలు అని వ్యాఖ్యానించినట్లుగా వార్తలు వచ్చాయి. ఆ పదాన్నే యువత తమకు అనుకూలంగా మార్చుకొని ‘కాక్ రోచ్ జనతా పార్టీ’ పేరుతో ఈ ట్రెండ్ ను సృష్టించారు. కేవలం వారం రోజులు తిరగకముందే ఈ వినూత్న కాన్సెప్ట్ మిలియన్ల కొద్దీ నెటిజన్లను ఆకర్షించి.. దేశవ్యాప్తంగా వైరల్ అవుతోంది.
పాక్‌లోనూ ‘బొద్దింకల’ అకౌంట్లు
భారత్‌లో విపరీతంగా వైరల్ అయిన ఈ కాన్సెప్ట్.. ఇప్పుడు పాకిస్తాన్ సోషల్ మీడియాను సైతం ఆక్రమించింది. అక్కడ కూడా యువత ఈ ట్రెండ్‌ను అందిపుచ్చుకుని రకరకాల పేర్లతో పేరడీ అకౌంట్లను క్రియేట్ చేశారు. ప్రస్తుతం పాక్ సోషల్ మీడియాలో.. ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’, ‘కాక్‌రోచ్ అవామీ లీగ్’, ‘ముత్తాహిదా కాక్‌రోచ్ మూవ్‌మెంట్’ వంటి పేర్లు తెగ హల్‌చల్ చేస్తున్నాయి. అక్కడి ప్రధాన రాజకీయ పార్టీల పేర్లను పోలి ఉండేలా ఈ పేర్లను పెట్టడంతో ఒక్కసారిగా పాక్ లోనూ చర్చ మెుదలైంది.
బయోలో ఆసక్తికర కొటేషన్స్..
పాకిస్థాన్ లో తెరవబడ్డ క్రాకోచ్ ఖాతాల బయోల్లో ఆసక్తిక క్యాప్షన్ దర్శనమిస్తున్నాయి. ‘కాక్‌రోచ్ అవామీ పార్టీ’ తన బయోలో.. ‘ఇది యువత కోసం, యువత చేత నడపబడే పాకిస్థాన్ యువ రాజకీయ వేదిక’ అని రాసుకొచ్చింది. మరో అకౌంట్ బయోలో పెట్టిన కొటేషన్ అయితే అందరినీ ఆలోచింపజేస్తోంది. అందులో.. ‘జిన్హే సిస్టమ్ నే కాక్‌రోచ్ సంఝా, హమ్ ఉన్హీ అవామ్ కీ అవాజ్ హై’ (ఏ ప్రజలనైతే ఈ వ్యవస్థ బొద్దింకలుగా భావించిందో.. మేము ఆ సామాన్య ప్రజల గొంతుకలం) అంటూ ఉర్దూలో రాశారు.
డిజిటల్ విప్లవానికి సరికొత్త రూపం
రాజకీయ నాయకుల వాగ్దానాలు, ఆర్థిక సంక్షోభాలు, నిరుద్యోగంతో విసిగిపోయిన యువత.. తమ నిరసనను వ్యక్తం చేయడానికి ఈ సరికొత్త కాక్ రోచ్ మార్గాన్ని ఎంచుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. పాక్ యువతలోనూ నానాటికి పెరిగిపోతున్న అసహనం, అసంతృప్తి.. ఈ కాక్ రోచ్ ఉద్యమం ద్వారా నెట్టింట వ్యక్తమవుతోందని పేర్కొంటున్నారు. మెుత్తం మీద భారత్ లో మెుదలైన ఈ ‘బొద్దింక విఫ్లవం’.. దయాది దేశం పాకిస్థాన్ కు విస్తరించడం ప్రస్తుతం ఆసక్తి రేపుతోంది. రాబోయే రోజుల్లో ఈ డిజిటల్ ట్రెండ్ ఇంకెన్ని దేశాలకు విస్తరిస్తుందోనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.








