AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వైజాగ్‌లో అదానీ ఎనర్జీకి రూ. 8,500 కోట్ల భారీ ప్రాజెక్ట్..

ఆంధ్రప్రదేశ్‌లో పారిశ్రామిక అభివృద్ధికి ఊతమిచ్చే దిశగా మరో కీలక ముందడుగు పడింది. ప్రముఖ సంస్థ అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ లిమిటెడ్ (ఏఈఎస్ఎల్‌) రాష్ట్రంలో రూ. 8,500 కోట్ల విలువైన భారీ ఇంటర్‌-స్టేట్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టును దక్కించుకుంది. విశాఖపట్నం ప్రాంతంలో ప్రతిపాదిత గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా ప్రాజెక్టులకు అవసరమైన విద్యుత్‌ను సరఫరా చేసేందుకు ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. దీని ద్వారా సుమారు 4,500 మెగావాట్ల విద్యుత్ డిమాండ్‌ను తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

 

ప్రభుత్వం నిర్వహించిన టారిఫ్-ఆధారిత పోటీ బిడ్డింగ్ (టీబీసీబీ) విధానంలో అత్యంత పోటీతత్వ ధరను కోట్ చేసి అదానీ ఎనర్జీ ఈ ప్రాజెక్టును కైవసం చేసుకుంది. ఒప్పందం ప్రకారం.. ఈ ప్రాజెక్టును 30 నెలల్లోగా పూర్తి చేయాల్సి ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ ప్రాజెక్టును ‘వైజాగ్ పవర్ ట్రాన్స్‌మిషన్ లిమిటెడ్’ అనే ప్రత్యేక సంస్థ (ఎస్‌పీవీ) కింద నిర్వహించనున్నారు.

 

ఈ ప్రాజెక్టుపై అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ సీఈఓ కందర్ప్ పటేల్ మాట్లాడుతూ.. “భారతదేశ పారిశ్రామిక ప్రగతికి అవసరమైన ఇంధన మౌలిక సదుపాయాల నిర్మాణంలో వైజాగ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ ఒక ముఖ్యమైన ముందడుగు. ఇది ఏపీలో గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమ్మోనియా సామర్థ్యం అభివృద్ధికి మద్దతు ఇవ్వడమే కాకుండా, పెందుర్తి-విశాఖపట్నం ప్రాంతంలో పెరుగుతున్న డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డిమాండ్‌కు గ్రిడ్‌ను బలోపేతం చేస్తుంది” అని వివరించారు.

 

ప్రస్తుతం విశాఖపట్నం డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ హబ్‌గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏఐ, హైపర్‌స్కేల్ డేటా సెంటర్ల అభివృద్ధి, సబ్‌సీ కనెక్టివిటీ, లాజిస్టిక్స్, క్లీన్ ఎనర్జీ వంటివి రానున్నాయి. ఈ నేపథ్యంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను తీర్చడంలో ఈ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్ట్ అత్యంత కీలకం కానుంది. ఈ ప్రాజెక్ట్‌తో ఏఈఎస్ఎల్‌ తన నెట్‌వర్క్‌కు అదనంగా 1,582 సర్క్యూట్ కిలోమీటర్ల (ckm) ట్రాన్స్‌మిషన్ లైన్లు, 10,500 ఎంవీఏ ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యాన్ని జోడించనుంది. దీంతో కంపెనీ మొత్తం ట్రాన్స్‌మిషన్ నెట్‌వర్క్ 29,531 ckmకు, ట్రాన్స్‌ఫర్మేషన్ సామర్థ్యం 1,33,675 ఎంవీఏకు చేరుకుంటుంది. దేశంలో అతిపెద్ద ప్రైవేట్ ట్రాన్స్‌మిషన్ కంపెనీగా ఏఈఎస్ఎల్‌ కొనసాగుతోంది.

ANN TOP 10