దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హీరా గోల్డ్ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉండి చాలాకాలంగా తప్పించుకు తిరుగుతున్న నౌషీరా షేక్ను ఎట్టకేలకు ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఆమె గుర్గావ్ లో ఉన్నట్టు పక్కాగా సమాచారాన్ని సేకరించి పట్టుకున్నారు. విచారణలో నౌషీరా షేక్ మారు పేరుతో, ఫోర్జరీ చేసిన గుర్తింపు పత్రాలతో గుర్గావ్ లో ఆశ్రయం పొందినట్టుగా వెల్లడైంది.
వివరాల్లోకి వెళ్తే..
నౌషీరా షేక్.. హీరా గోల్డ్ పేర వేర్వేరు రాష్ట్రాలకు చెందిన లక్షా 72వేల మంది నుంచి అక్రమంగా రూ. 5,600 కోట్లను డిపాజిట్లుగా సేకరించింది. తమ సంస్థలో పెట్టుబడులు పెడితే ఏటా 36 శాతం లాభాలు ఇస్తామని నమ్మించి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకతో పాటు పలు రాష్ట్రాల్లో యధేచ్ఛగా మోసాలు సాగించింది. ఈ క్రమంలో నౌషీరా షేక్ పై కేసులు నమోదయ్యాయి. ఆ తరువాత ఆమె మనీలాండరింగ్ కు పాల్పడినట్టుగా ఆరోపణలు రావటంతో ఈడీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
డిజిటల్ ఆధారాలు సీజ్
దర్యాప్తులో భాగంగా ప్రజల నుంచి డిపాజిట్ల రూపంలో కొల్లగొట్టిన వేలాది కోట్ల రూపాయలను నౌహీరా షేక్ విదేశాలకు మళ్లించేందుకు సమకూర్చుకున్న పలు డాక్యుమెంట్లు, డిజిటల్ ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. నౌషీరా షేక్ తోపాటు ఆమె కుటుంబ సభ్యులు, బంధువుల పేర్ల మీద ఉన్న రూ.45 కోట్లు విలువ చేసే 13 ఆస్తులు పత్రాలు, బినామీల పేర ఉన్న రూ. 25 కోట్ల విలువైన 11 ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లను కూడా సీజ్ చేశారు.
రూ.400 కోట్ల ఆస్తులు అటాచ్..
అదే సమయంలో వేల కోట్ల డబ్బు గోల్ మాల్ కేసులో నౌహీరా షేక్ కు చెందిన రూ. 400 కోట్ల విలువ చేసే స్థిర, చరాస్తులను అటాచ్ చేశారు. వీటిని వేలం వేయటం ద్వారా వచ్చే డబ్బును బాధితులకు అందచేయాలని ఇప్పటికే ఈడీ అధికారులు నిర్ణయించారు. వాస్తవానికి ఈ ఆరోపణలకు సంబంధించి గతంలోనే నౌషీరాను అరెస్టు చేశారు. అప్పట్లో సుప్రీం కోర్టు అయిదు షరతులతో బెయిల్ కూడా మంజూరు చేసింది. ఏ ఒక్క షరతును ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని పేర్కొంది.
అద్దె ఇంట్లో.. నకిలీ పేరుతో మకాం
సుప్రీంకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ నౌషీరా షరతులు ఉల్లఘించడంతో ఆమెకు మంజూరైన బెయిల్ ను కొంత కాలం క్రితం న్యాయస్థానం రద్దు చేసింది. అప్పటి నుంచి నౌషీరా షేక్ పరారీలో ఉంది. కాగా, ఆమె గుర్గావ్ లో ఓ ఇల్లును అద్దెకు తీసుకుని నకిలీ పేరు, ఫోర్జరీ ఆధార్ కార్డు, ఇతర గుర్తింపు పత్రాలను ఉపయోగించి ఉపయోగించి మారు పేరుతో ఉంటున్నట్టు సమాచారాన్ని సేకరించిన ఈడీ హైదరాబాద్ జోనల్ బృందం.. శుక్రవారం ఉదయం నౌషీరా షేక్ ను అరెస్ట్ చేసింది. ఆమెను ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి తీసుకువచ్చారు. అనంతరం వైద్య పరీక్షలు జరిపించి కోర్టులో హాజరు పరిచి రిమాండ్ తరలించనున్నారు.








