నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) ఆధ్వర్యంలో నిరసనలు కొనసాగుతున్న వేళ, నిఘా సంస్థలు సంచలన హెచ్చరికలు జారీ చేశాయి. ఈ ఆందోళనలను ఆసరాగా చేసుకుని దేశంలో అశాంతిని సృష్టించేందుకు, హింసను ప్రేరేపించేందుకు విద్రోహ శక్తులు భారీ స్థాయిలో దుష్ప్రచారానికి తెరలేపినట్లు స్పష్టం చేశాయి. సోషల్ మీడియా ద్వారా నకిలీ, తప్పుదోవ పట్టించే కంటెంట్‌ను వ్యాప్తి చేసి ప్రజలను రెచ్చగొట్టే ప్రమాదం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు హెచ్చరించాయి.
నమ్మకాన్ని దెబ్బతీయడమే లక్ష్యం
యూనిఫాంలో ఉన్న సైనిక లేదా పోలీసు సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజకీయ వ్యాఖ్యలు చేస్తున్నట్లు చిత్రీకరించిన పలు నకిలీ వీడియోలు ఇప్పటికే ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. ప్రస్తుతం నెలకొన్న అస్థిర పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుని, అల్లర్లను సృష్టించేందుకు సంఘ విద్రోహ శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారి ఒకరు తెలిపారు. డీప్‌ఫేక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) టెక్నాలజీలను ఉపయోగించి ఇలాంటి వీడియోలను సృష్టించి, వాటిని సైన్యం లేదా పోలీసుల సందేశాలుగా ప్రచారం చేయడమే వారి ఉద్దేశమని అధికారులు విశ్లేషిస్తున్నారు.
ప్రధాన ప్రభుత్వ సంస్థలపై, ముఖ్యంగా భారత సైన్యంపై ప్రజలకు ఉన్న అపారమైన నమ్మకాన్ని దెబ్బతీయడమే ఈ దుష్ప్రచారం వెనుక ఉన్న ప్రధాన కుట్ర అని నిఘా వర్గాలు తేల్చిచెప్పాయి. దేశ ప్రజలకు సైన్యంపై ఉన్న విశ్వాసం కారణంగానే, విద్రోహ శక్తులు దానిని లక్ష్యంగా చేసుకున్నాయని హెచ్చరించాయి. ఇలాంటి తప్పుడు పోస్టులు ఎక్కువ కాలం సోషల్ మీడియాలో ఉంటే జరిగే నష్టం తీవ్రంగా ఉంటుందని, వాటిని తక్షణమే గుర్తించి, నిరోధించాల్సిన అవసరం ఉందని మరో అధికారి అభిప్రాయపడ్డారు.
గతంలోనూ ఇలాంటి కుట్రలు
గతేడాది పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో కూడా పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో ఇలాంటి ప్రచారమే జరిగిందని అధికారులు గుర్తు చేస్తున్నారు. ఆ ఆపరేషన్‌లో భారత సైన్యానికి భారీ నష్టం వాటిల్లిందని ఫేక్ వీడియోలతో ప్రచారం చేసి, సైనిక బలగాల స్థైర్యాన్ని దెబ్బతీయడానికి, ప్రజల్లో అనుమానాలు రేకెత్తించడానికి ప్రయత్నించారు. ప్రస్తుత నీట్ వివాదంలో కూడా విదేశీ శక్తుల హస్తం ఉండే అవకాశం లేకపోలేదని భద్రతా ఏజెన్సీలు అనుమానిస్తున్నాయి.
నిరసనలు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు, సైనిక సిబ్బంది ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నట్లు ఉన్న దాదాపు 20 వీడియోలను అధికారులు గుర్తించారు. అయితే, ఈ వీడియోలలోని వ్యక్తులను గుర్తించడం సవాలుగా మారింది. వాటిలో ఎలాంటి నేమ్ ట్యాగ్‌లు, ఇన్సిగ్నియా (గుర్తింపు చిహ్నాలు) లేదా ఇతర ఆధారాలు లేకపోవడంతో దర్యాప్తు కష్టతరంగా మారింది. వీడియోలను అప్‌లోడ్ చేసి, కొన్ని గంటల పాటు వైరల్ చేసి, ఆ తర్వాత వెంటనే డిలీట్ చేసే ఒక నిర్దిష్ట పద్ధతిని అనుసరిస్తున్నట్లు గుర్తించారు. మూలాలను కనుక్కోవడం కష్టతరం చేసేందుకే ఈ ఎత్తుగడ వేస్తున్నారని, కానీ ఆ కొద్ది సమయంలోనే జరగాల్సిన నష్టం జరిగిపోతుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి ఫేక్ వీడియోల ప్రచారం మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని భద్రతా ఏజెన్సీలు అప్రమత్తంగా ఉన్నాయి.








