భారతదేశంలోని లక్షలాది మంది వైద్య విద్యాభ్యర్థుల భవిష్యత్తుకు, వారి తల్లిదండ్రుల ఆశలకు సంబంధించిన ఘటనిది. నీట్ పరీక్షల నిర్వహణలో ఎదురవుతున్న వివాదాలు, పేపర్ లీకేజీ ఆరోపణలపై దేశ అత్యున్నత నాయస్థానమైన సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి కీలక ఆదేశాలు జారీ చేసింది.
సుప్రీంకోర్టు ఆదేశాలు..
నీట్ పరీక్షల నిర్వహణలో జరుగుతున్న లోపాలకు ఇకనైనా శాశ్వత ముగింపు పలకాలాని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని విచారణ సందర్భంగా వ్యాఖ్యానించింది. ఇందులో భాగంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఒక సమగ్ర అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ముఖ్యంగా ప్రశ్నపత్రాల రూపకల్పన నుంచి కేంద్రాలకు చేరే వరకు రవాణా వ్యవస్థ ఎంతవరకు భద్రంగా ఉందో వివరించాలని కోరింది. అంతేకాకుండా, పేపర్ లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు రాబోయే రోజుల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించడంపై కేంద్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని తెలియజేయాలని ధర్మాసనం పేర్కొంది.
కేంద్ర ప్రభుత్వం కీలక హామీ..
సుప్రీంకోర్టు ఆదేశాలపై స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. విద్యార్థుల భవిష్యత్తును కాపాడేందుకు తాము సంపూర్ణంగా కట్టుబడి ఉన్నామని కోర్టుకు తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాల కోసం సాధారణ చర్యల కంటే ‘పది అడుగులు అదనంగా’ వేసి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నామని వెల్లడించింది. రాబోయే పరీక్షల్లో పూర్తి పారదర్శకత, భద్రత ఉండేలా అన్ని రకాల ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నామని, అర్హులైన అభ్యర్థులకు ఎలాంటి అన్యాయం జరగనివ్వమని స్పష్టమైన హామీ ఇచ్చింది.








