తెలంగాణ మంత్రుల శాఖల మార్పు అంశం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎవరి శాఖ ఉంటుంది? ఎవరికి ఏ కొత్త బాధ్యత దక్కుతుంది? అనేది సస్పెన్స్ గా మారింది. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న ‘మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ’ వార్తలు సచివాలయ వర్గాల్లోనూ, రాజకీయ వర్గాల్లోనూ సెగలు పుట్టిస్తున్నాయి. అగ్రనాయకత్వం నుంచి వచ్చిన కొన్ని లీకులు ఇప్పుడు మంత్రులలో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ప్రభుత్వ పనితీరును మరింత వేగవంతం చేయడానికి, క్షేత్రస్థాయిలో పాలనను పరుగులు పెట్టించడానికి కొన్ని కీలక శాఖలను మార్చక తప్పదని హైకమాండ్ భావిస్తోంది.
మంత్రులకు షప్లింగ్ టెన్షన్..
ముఖ్యంగా కీలకమైన రెవెన్యూ, హోం, విద్యుత్ వంటి శాఖల విషయంలో సమూల మార్పులు జరిగే అవకాశం ఉందని సమాచారం. కొందరు మంత్రుల పనితీరుపై అసంతృప్తితో ఉన్న అధిష్టానం, వారికి ప్రాధాన్యత లేని శాఖలను కేటాయించి, యాక్టివ్‌గా ఉన్న వారికి కీలక బాధ్యతలు అప్పగించాలని చూస్తోంది. దీంతోనే ఇప్పుడు మంత్రులకు షప్లింగ్ టెన్షన్ మొదలైంది. సహజంగా కాంగ్రెస్ పార్టీలో హై కమాండ్ ఆదేశాలను తూచా తప్పక పాటించాల్సిన పరిస్థితులు నెలకుంటాయి. ఈ నేపథ్యంలో ఏ శాఖ ఎవరికి కేటాయిస్తారోనని సీనియర్ మంత్రులతో పాటు ఇటీవల కొత్తగా బాధ్యతలు తీసుకున్న మంత్రుల్లోనూ ఉత్కంఠ నెలకొన్నది.
రెండున్నర ఏళ్లయినా.. కొలిక్కి రాని క్యాబినెట్..
ప్రభుత్వం కొలువుదీరి రెండున్నర ఏళ్లు గడుస్తున్నా, ఇప్పటికీ ‘ఫుల్ క్యాబినెట్’ అన్న ముచ్చట తీరలేదు. కొన్ని శాఖలు ఇప్పటికీ ముఖ్యమంత్రి వద్దే ఉండటం లేదా అదనపు బాధ్యతలుగా ఉండటంతో పాలనపై ప్రభావం పడుతోందన్న విమర్శలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఖాళీగా ఉన్న మంత్రి పదవులను భర్తీ చేస్తారా? పాత వారికి ఉద్వాసన పలికి కొత్త వారికి ఛాన్స్ ఇస్తారా? కేవలం శాఖలను మాత్రమే అటు ఇటు మారుస్తారా? అనే ప్రశ్నలు ఉత్కంఠను పెంచుతున్నాయి. ఇప్పటికే కొందరు సీనియర్ మంత్రులు తమకు అప్పగించిన శాఖలను ఎట్టి పరిస్థితుల్లో మార్చవద్దని సీఎంకు చెప్పినట్లు సమాచారం. గతంలో తమ కేటాయించిన శాఖల పనితీరును మెరుగుపరిచేందుకు రెండున్నర ఏళ్లపాటు శ్రమించామని, మళ్లీ కొత్త శాఖల అప్పగించడం వల్ల మొదటి నుంచి టాస్క్‌ను మొదలు పెట్టాల్సి ఉంటుందని కొందరు సీనియర్ మంత్రులు సీఎంకు వివరించినట్లు తెలిసింది. ఇలాంటి పరిస్థితుల్లో హై కమాండ్ ఆదేశాలు ఏ విధంగా ఉంటాయోనని అందరిలోనూ ఆసక్తి నెలకొన్నది.
మంత్రుల్లో మొదలైన వణుకు..
తమ శాఖలు ఎక్కడ మారిపోతాయోనని కొందరు మంత్రులు భయపడుతుంటే, మరికొందరు మాత్రం తమకు ప్రస్తుతం ఉన్న శాఖ కంటే మెరుగైన శాఖ దక్కుతుందని ఆశగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా కీలకమైన హామీల అమలులో వెనుకబడిన శాఖల మంత్రులకు షఫ్లింగ్ ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. వాస్తవానికి పాలనలో వేగం పెంచాలంటే మార్పు అనివార్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అభిప్రాయాలు, లీడర్ల మనోభావాలు, క్షేత్రస్థాయి కార్యకర్తల ఫీడ్ బ్యాక్, పొలిటికల్ ఈక్వేషన్స్, క్యాస్ట్ ఈక్వేషన్స్ వంటివి క్రోడీకరిస్తూ ఏఐసిసి తీసుకునే నిర్ణయం పై ప్రభుత్వం పై ప్రజలు ఓ అభిప్రాయానికి వచ్చే ఛాన్స్ ఉన్నది.






