తెలంగాణ రాష్ట్ర సేన (టీఆర్ఎస్) అధినేత్రి కల్వకుంట్ల కవితకు.. సికింద్రాబాద్ రైల్వే కోర్టు షాకిచ్చింది. రైల్ రోకో కేసుకు సంబంధించి రేపు (బుధవారం) విచారణకు హాజరుకావాలని సమన్లు జారీ చేసింది. ఉదయం 10.30 గంటలకు సికింద్రాబాద్ లోని సెకండ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టుకు రావాలని సమన్లలో సూచించింది. కాగా రైల్ రోకో ఘటనకు సంబంధించి కవితతో పాటు మరో 12 మంది టీఆర్ఎస్ నాయకుల పైనా కేసులు నమోదయ్యాయి.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇటీవల కామారెడ్డి జిల్లా కేంద్రంలో కవిత రైల్ రోకో చేశారు. తెలంగాణ అసెంబ్లీ, కౌన్సిల్ ఆమోదించి పంపిన బీసీ బిల్లులకు కేంద్రం వెంటనే ఆమోదం తెలపాలని డిమాండ్ చేశారు. బీసీలకు విద్య, ఉద్యోగాలు, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పించే వరకు ఉద్యమిస్తామని ఆ సందర్భంగా తేల్చి చెప్పారు.
అయితే కల్వకుంట్ల కవితతో పాటు టీఆర్ఎస్ నాయకులు చేపట్టిన రైల్ రోకో కారణంగా సిర్నపల్లి – ఇందల్వాయి రైల్వే స్టేషన్ల మధ్య రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ కు వెళ్తున్న దేవగిరి ఎక్స్ ప్రెస్ ను నిలిపివేశారు. అలాగే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ రూట్ లో ప్రయాణిస్తున్న మరో గూడ్స్ రైలును కొద్దిసేపు ఆపేయాల్సి వచ్చింది. దీంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగించిన కారణంగా కవితతో పాటు మరో 12 మంది నాయకులపై కామారెడ్డి రైల్వే ఏఎస్ఐ రవీంద్ర బాబు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా కవితతో పాటు 12 మంది టీఆర్ఎస్ నాయకులపై కేసులు నమోదు చేశారు. ఈ కేసులో విచారణకు సికింద్రాబాద్ రైల్వే కోర్టు ఆదేశించింది.






