భారతీయ జనతా పార్టీ(బీజేపీ) తదుపరి లక్ష్యం తెలంగాణే అని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ వేదికగా జరిగిన భారీ బహిరంగ సభలో మోదీ ప్రసంగించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సాధించిన చరిత్రాత్మక విజయం దేశ రాజకీయాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిందని ఆయన పేర్కొన్నారు. బెంగాల్ ప్రజలు అవినీతి.. వారసత్వ రాజకీయాలను తిరస్కరించి అభివృద్ధి వైపు మొగ్గు చూపారని.. అదే స్పూర్తి ఇప్పుడు తెలంగాణలోనూ కనిపిస్తోందని మోదీ వ్యాఖ్యానించారు.
“నా ప్రియమైన తెలంగాణ ప్రజలారా.. మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు..” అంటూ తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. రాష్ట్ర రాజకీయ భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు చేశారు. బెంగాల్‌లో ఓడిపోయింది కేవలం ఒక పార్టీ మాత్రమే కాదని.. రాజ్యాంగ వ్యతిరేక శక్తులు.. అరాచక శక్తులు ఓడిపోయాయని ఆయన అన్నారు. బెంగాల్‌లో జనం ఎలాగైతే మార్పును కోరుకున్నారో.. తెలంగాణలోనూ అదే ఉత్సాహం.. మార్పు కోసం తపన ప్రజల్లో కనిపిస్తోందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
పశ్చిమ బెంగాల్ విజయం తర్వాత బీజేపీ తదుపరి లక్ష్యం తెలంగాణే అని మోదీ స్పష్టం చేశారు. “బెంగాల్ గెలిచాం.. వచ్చేది తెలంగాణలో మన ప్రభుత్వమే..” అంటూ కార్యకర్తల్లో రెట్టింపు ఉత్సాహాన్ని నింపారు. కుటుంబ పాలన.. అవినీతి కోరల్లో చిక్కుకున్న తెలంగాణను విముక్తం చేసే సమయం ఆసన్నమైందని.. ప్రజలు తమను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ గడ్డపై బీజేపీ జెండా ఎగరడం ఖాయమని.. ఇది తెలంగాణ ప్రజల విజయం అవుతుందని ప్రధాని ఆకాంక్షించారు.








