దళిత డ్రైవర్ వీధి సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా మరోసారి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులోని సాక్షులను అనంతబాబు బెదిరించడమే కాకుండా, వారికి డబ్బు ఎర చూపి కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ దళిత సంఘాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు రెండో రోజు కూడా తమ నిరసనలను కొనసాగించారు. కాకినాడ నుంచి మొదలుకొని కోస్తా, రాయలసీమ, మన్యంలోని ఏజెన్సీ ప్రాంతాల వరకు ఆందోళనలు విస్తరించాయి. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేసి, బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ దళిత, గిరిజన సంఘాలు రోడ్డెక్కాయి.
సిట్ దర్యాప్తుతో వెలుగులోకి వచ్చిన వాస్తవాలు
గతంలో సుబ్రహ్మణ్యం మృతదేహాన్ని అనంతబాబు కారులో తీసుకొచ్చి అతని కుటుంబ సభ్యులకు అప్పగించడం “డోర్ డెలివరీ హత్య”గా రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రమాదవశాత్తూ చనిపోయాడని చిత్రీకరించే ప్రయత్నం చేసినా, పోస్టుమార్టం నివేదికలో గాయాలు ఉన్నట్లు తేలింది. అయితే, కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం ఈ కేసుపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ విచారణలో సుబ్రహ్మణ్యం శరీరంపై ఏకంగా 31 చోట్ల బలమైన గాయాలు ఉన్నట్లు నిర్ధారణ కావడంతో, ఇది అత్యంత కిరాతకమైన హత్య అని తేలింది.
ఈ నివేదిక బయటకు రావడంతోనే అనంతబాబులో భయం మొదలై, సాక్షులను బెదిరించే స్థాయికి దిగజారారని దళిత సంఘాలు ఆరోపిస్తున్నాయి. అమలాపురం, మండపేటలో జరిగిన నిరసనల్లో నిందితుడిని ఉరితీయాలంటూ తీవ్ర స్థాయిలో డిమాండ్లు వినిపించాయి.
కాకినాడ కేంద్రంగా ఆందోళనలు.. రూ.3 లక్షల సుపారీ ఎర
బుధవారం కాకినాడలోని వైసీపీ జిల్లా కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టిన దళిత సంఘాల నాయకులు, గురువారం ఇంద్రపాలెం వంతెన వద్ద ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్ద తమ నిరసనను కొనసాగించారు. ఈ సందర్భంగా “దళిత ద్రోహి జగన్ మోహన్ రెడ్డి” అంటూ నినాదాలతో హోరెత్తించారు.
సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులకు అనంతబాబు ఒక్కొక్కరికి లక్ష రూపాయల చొప్పున మొత్తం ముగ్గురికి మూడు లక్షలు సుపారీగా ఎర వేశారని, సాక్ష్యం చెప్పవద్దని బెదిరించారని దళిత నేతలు ఆరోపించారు. కోర్టులో వ్యతిరేకంగా సాక్ష్యం చెబితే “మీ శవాలు కూడా దొరకవు” అంటూ హెచ్చరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ దర్యాప్తులో సుబ్రహ్మణ్యం శరీరంపై 31 గాయాలు ఉన్నట్లు తేలడంతోనే భయపడి అనంతబాబు ఈ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
హంతకుడిపై జగన్‌కు ఎందుకంత ప్రేమ?
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనకారులు మాజీ ముఖ్యమంత్రి జగన్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రంపచోడవరం, అనపర్తి, గోపాలపురం వంటి అనేక నియోజకవర్గాల్లో అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసనలు చేపట్టారు. “ఓట్ల కోసం దళితులను వాడుకుని, దళిత యువకుడి ప్రాణాలు తీసిన హంతకులకు జగన్ కార్పెట్ పరుస్తున్నారు. దారుణంగా కొట్టి చంపి, డోర్ డెలివరీ చేసిన అనంతబాబును వెనకేసుకురావడం దారుణం” అని వారు విమర్శించారు. సామాన్యులకు ఒక చట్టం, అధికార పార్టీ నేతలకు మరో చట్టమా అని ప్రశ్నించారు. వివేకా హత్య కేసు తరహాలోనే ఈ కేసులోనూ సాక్ష్యాలను తారుమారు చేయడానికి కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
ఉమ్మడి తూర్పు గోదావరిలో ఉద్రిక్తత
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉద్రిక్తంగా మారాయి. తుని నియోజకవర్గంలో దళిత సంఘాలు రహదారిని దిగ్బంధం చేసి నిరసన తెలిపాయి. పి.గన్నవరంలో సుమారు 250 మందికి పైగా కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించి, అనంతబాబును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కొవ్వూరులో నిరసనకారులు రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది.
ఇదే క్రమంలో, కాకినాడలో విలేకరుల సమావేశం నిర్వహించిన మహాసేన రాజేష్, అనంతబాబుకు రెండు రోజుల గడువు విధించారు. ఈ లోగా లొంగిపోకపోతే తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. జగన్ అండతోనే నిందితులు స్వేచ్ఛగా తిరుగుతున్నారని, దళితుల రక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు.
కోస్తా నుంచి రాయలసీమ వరకు నిరసన సెగ
ఈ నిరసనలు కేవలం కోస్తాంధ్రకే పరిమితం కాలేదు. విజయవాడ ధర్నా చౌక్ వద్ద బహుజన జేఏసీ ఆధ్వర్యంలో భారీ నిరసన చేపట్టారు. విశాఖపట్నం కలెక్టరేట్ వద్ద దళిత, ప్రజా సంఘాలు ఆందోళన నిర్వహించాయి. ఆధ్యాత్మిక నగరం తిరుపతిలో దళిత సంఘాలు వినూత్నంగా కళ్లకు గంతలు కట్టుకుని మౌన ప్రదర్శన నిర్వహించి, నిందితుడిని ఎమ్మెల్సీ పదవి నుంచి బర్తరఫ్ చేయాలని కోరాయి. ప్రతిచోటా అనంతబాబు బెయిల్ రద్దు చేసి, తక్షణమే అరెస్ట్ చేయాలన్న డిమాండ్ బలంగా వినిపించింది.
మన్యంలోనూ మిన్నంటిన ఆగ్రహం
అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లోనూ నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. అరకు, పాడేరు, కురుపాం, సాలూరు, రంపచోడవరం వంటి గిరిజన ప్రాంతాల్లో దళిత, గిరిజన నాయకులు ఐక్యంగా ఆందోళనలు చేపట్టారు. వైసీపీ పాలనలో దళితులపై అడుగడుగునా అన్యాయం జరిగిందని, డోర్ డెలివరీ ఘటనను దళిత సమాజం ఎప్పటికీ మరచిపోదని పార్వతీపురంలో నాయకులు మండిపడ్డారు. అనంతబాబుకు జగన్ ఆశ్రయం కల్పించడం దళితులపై ఆయనకున్న వైఖరికి నిదర్శనమని వారు ఆరోపించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదు
రాజమండ్రి, జగ్గంపేట, సామర్లకోట వంటి పలు ప్రాంతాల్లోనూ అంబేద్కర్ విగ్రహాల వద్ద ధర్నాలు, ర్యాలీలు కొనసాగాయి. రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కుతో గత ప్రభుత్వానికి బుద్ధి చెప్పినా, నేరస్తుల తీరు మారడం లేదని రాజమండ్రిలో దళిత నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. సాక్షులకు తక్షణమే పోలీసు రక్షణ కల్పించి, అనంతబాబు బెయిల్ రద్దు చేసి అరెస్ట్ చేయాలని వారు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని దళిత సంఘాలు స్పష్టం చేశాయి.








