ఏపీ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలను అనుసంధానిస్తూ బుల్లెట్ రైలు తీసుకురావాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. తమిళనాడులోని మహాబలిపురంలో అమిత్ షా అధ్యక్షతన సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబుతో పాటు తమిళనాడు, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి సీఎంలు హాజరయ్యారు. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి గురించి సీఎం చంద్రబాబు ప్రస్తావించారు. కేంద్ర రాష్ట్రాల మధ్య విశ్వాసం, పరస్పర సహకారంతో సమస్యల పరిష్కారం జరగాలని పేర్కొన్నారు.
ఈ క్రమంలోనే ఏపీ, కర్ణాటక, తమిళనాడును అనుసంధానించే బుల్లెట్ ట్రైన్ కారిడార్ ప్రతిపాదనను సీఎం చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు. కుప్పం మీదుగా బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరారు. అమరావతి – బెంగళూరు – చెన్నై నగరాలను అనుసంధానించే రవాణా వ్యవస్థ ఉండాలని స్పష్టం చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఉమ్మడి లాజిస్టిక్స్ నెట్‌వర్క్, డ్రై పోర్టులు ఏర్పాటు చేయాలన్నారు. దక్షిణాది విద్యుత్ గ్రిడ్‌ను జాతీయ గ్రిడ్‌తో అనుసంధానించాలన్నారు. దక్షిణాదిలోని యూనివర్సిటీలు, నైపుణ్యాభివృద్ధి సంస్థలతో ఉమ్మడి కన్సార్టియం ఏర్పాటు చేయాలని అమిత్ షాకు విజ్ఞప్తి చేశారు.
అలాగే విపత్తుల సమయంలో రాష్ట్రాలు పరస్పరం సహకరించుకునే మ్యూచువల్ ఎయిడ్ ఫోర్స్ ఏర్పాటుకు చంద్రబాబు ప్రతిపాదన చేశారు. తిరుపతి నుంచి కాశీ, అయోధ్య, చార్‌ధామ్ వరకు ఉమ్మడి ఆధ్యాత్మిక పర్యాటక సర్క్యూట్ ఏర్పాటు చేయాలన్నారు. మరోవైపు దేశ జీడీపీలో దక్షిణాది రాష్ట్రాల వాటా సుమారు 31 శాతం ఉందన్న సీఎం.. 2047 నాటికి దక్షిణాది ఆర్థిక వ్యవస్థ 10 ట్రిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందన్నారు. వికసిత్ భారత్ నిర్మాణంలో కీలక ఆర్థిక శక్తిగా దక్షిణాది రాష్ట్రాలు ఎదగాలనీ చంద్రబాబు ఆకాంక్షించారు.
పోలవరం, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి ప్రాజెక్టులు.. కేంద్ర సహకారంతోనే సాకారం అవుతున్నట్టు చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతికి చట్టబద్ధ రాజధాని హోదా సాధించామని.. వనరుల లోటు, సెక్షన్ 56లోని అంశాలను పరిష్కరించాలని అమిషాను కోరారు. దుగ్గరాజుపట్నం పోర్టు, రిఫైనరీ ప్రతిపాదనలకు వేగంగా అనుమతులు ఇవ్వాలన్నారు. విశాఖ, విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతిని కోరారు. అటు గోదావరి – కావేరి నదుల అనుసంధానంతో 500 టీఎంసీలకు పైగా నీటిని మళ్లించే ప్రతిపాదనను చంద్రబాబు తెరపైకి తీసుకొచ్చారు.
గోదావరి – కావేరి అనుసంధానంతో తమిళనాడు నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని చంద్రబాబు అన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు కలిసి నదీ జలాలపై సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గంగా – కావేరి నదుల అనుసంధానానికి దీర్ఘకాలిక జాతీయ ప్రణాళిక అవసరమన్నారు. నదుల అనుసంధానంపై కాలపరిమితితో కూడిన డీపీఆర్‌లు, అనుమతులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సహకారం, సమన్వయంతోనే దక్షిణాది రాష్ట్రాల అభివృద్ధి సాధ్యమన్న సందేశాన్ని చంద్రబాబు ఇచ్చారు. కాగా, దక్షిణాది రాష్ట్రాల సమగ్రాభివృద్ధి గురించి మంచి విజన్ తో చంద్రబాబు మాట్లాడారని సౌత్ స్టేట్స్ ముఖ్యమంత్రులు ప్రశంసించారు.








