AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

దక్షిణ మండలి సమావేశం.. అమిత్ షాకు విజయ్ సహా.. సౌత్ సీఎంలు కీలక ప్రతిపాదనలు..!

తమిళనాడులోని మహాబలిపురంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఆధ్వర్యంలో దక్షిణ మండలి (సదరన్‌ కౌన్సిల్‌) 31వ సమావేశం జరిగింది. ఈ భేటిలో దక్షిణాది రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక ప్రతిపాదనలు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు బుల్లెట్ రైలు కారిడార్ ను తెరపైకి తీసుకురాగా.. తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్ మరికొన్ని ప్రతిపాదనలు చేశారు. అవేంటో ఈ కథనంలో చూద్దాం.

ఈ సమావేశంలో తమిళనాడు సీఎం విజయ్ మాట్లాడుతూ.. కర్ణాటకతో ఉన్న కావేరి జలాల వివాదాన్ని ప్రస్తావించారు. జలాల వినియోగంపై సుప్రీంకోర్టు తీర్పులు, అథారిటీ నిర్ణయాలను అమలు చేయాలన్నారు. మరోవైపు నీట్ నుంచి తమిళనాడుకు మినహాయింపు, తమ రాష్ట్ర కోట ఎంబీబీఎస్ సీట్లను 12వ తరగతి మార్కుల ఆధారంగా భర్తీ చేయడం, డీలిమిటేషన్ పై తమకున్న అభ్యంతరాలను షా ముందు విజయ్ ప్రస్తావించారు. అలాగే తమిళనాడులో పారిశ్రామిక కారిడార్లు, మల్టీమోడల్ లాజిస్టిక్స్ పార్కులు ఏర్పాటు చేయాలని సూచించారు. తీర ప్రాంతాలకు సంబంధించిన బ్లూ ఎకానమీలో భాగస్వామ్యానికి తమిళనాడు సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రాలకు న్యాయమైన ఆర్థిక వాటాను కల్పించాలన్నారు.

కర్ణాటక సీఎం డీకే శివకుమార్ సైతం కావేరి జలాల సమస్యను ప్రధానంగా ప్రస్తావించారు. నీటి విషయంలో సమానత్వం, పారదర్శకత, సహకారం కీలకమన్నారు. మరోవైపు డీలిమిటేషన్‌లో దక్షిణాది ప్రాతినిధ్యం తగ్గించొద్దని సూచించారు. 1971 జనాభా ప్రాతిపదికను కొనసాగించాలన్నారు. 15వ ఆర్థిక సంఘంలో కర్ణాటక వాటా 4.7 నుంచి 3.6 శాతానికి తగ్గిందని.. దానిని తిరిగి పెంచాలని డిమాండ్ చేశారు. బెంగళూరు – ముంబయి నగరాలను అనుసంధానిస్తూ హైస్పీడ్ రైలు కావాలని పట్టుబట్టారు. ఖనిజ వనరులపై రాష్ట్రాల పన్ను హక్కులను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర రాష్ట్రాల మధ్య సహకార సమాఖ్య విధానం మరింత బలోపేతం కావాలని అభిప్రాయపడ్డారు. ‘న్యాయమైన నిధులు.. న్యాయమైన గొంతు.. రాష్ట్రాలకు తగిన గౌరవం’ కావాలని డీకే డిమాండ్ చేశారు.

కేరళ సీఎం వీడీ సతీశన్ భేటిలో మాట్లాడుతూ.. ఆయుష్మాన్‌ భారత్‌ నిధులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కోసం తాము రూ.1,493 కోట్లు ఖర్చు చేస్తే.. కేంద్రం ఇచ్చింది రూ.151 కోట్లే అని అన్నారు. రాష్ట్రాల వినియోగాన్ని బట్టి ప్రీమియం నిర్ణయించాలన్నారు. అలాగే ప్రజా రవాణా సంస్థలకు టోల్‌ మినహాయింపు ఇవ్వాలని అమిత్ షాను కోరారు. మరోవైపు కేరళ తీరంలోని 63 శాతం ప్రాంతం కోతకు గురవుతోందని.. తీర రక్షణకు NDRF, SDRF నిధులు వినియోగించేందుకు అనుమతివ్వాలన్నారు. రైలు మార్గాల పనులు వేగవంతంతో పాటు.. అటవీ మార్గాంలో రాకపోకలపై పూర్తి నిషేధం వద్దని సూచించారు. కాన్వాయ్‌ విధానంలో వాహనాలకు అనుమతి ఇవ్వాలని కోరారు. శాస్త్రీయ అధ్యయనం లేకుండా తమ రాష్ట్రంలోని  మైనింగ్ బ్లాకుల వేలం నిర్వహించవద్దని కేంద్రానికి కేరళ సీఎం సూచించారు.

ANN TOP 10